- Home
- Sports
- Cricket
- ICC Women's WC: మాస్టర్ బ్లాస్టర్ సరసన మిథాలీ రాజ్.. మహిళల క్రికెట్ లో అరుదైన రికార్డు సొంతం..
ICC Women's WC: మాస్టర్ బ్లాస్టర్ సరసన మిథాలీ రాజ్.. మహిళల క్రికెట్ లో అరుదైన రికార్డు సొంతం..
India w Vs Pakistan W - Mithali Raj: మహిళల క్రికెట్ కు సరైన ఆదరణ లేని సమయంలోనే భారత క్రికెట్ జట్టు తరఫున ఆడి సంచలన ఇన్నింగ్స్ నమోదు చేసిన మిథాలీ రాజ్.. మరో అరుదైన ఘనతను సాధించింది.

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సాధించింది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డున తన పేరిట కూడా లిఖించుకుంది.
న్యూజిలాండ్ వేదిగకా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ ఆడుతున్న ఆమె.. ఆరు వన్డే ప్రపంచకప్ లలో ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.
పురుషుల క్రికెట్ లో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పాకిస్థాన్ దిగ్గజం జావేద్ మియాందాద్ పేరిట ఉంది.
సచిన్ తన కెరీర్ లో 1992, 1996, 1999, 2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్ లలో భారత్ తరఫున ఆడాడు. ఇప్పుడు మిథాలీ కూడా ఈ జాబితాలో చేరింది.
ఇక తాజాగా మిథాలీ రాజ్.. 2000, 2005, 2009, 2013, 2017, 2022 వన్డే వరల్డ్ కప్ లలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించింది.
అంతకుముందు న్యూజిలాండ్ క్రికెటర్ డెబ్బీ హాక్లీ, ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ లు ఐదు వన్డే ప్రపంచకప్ లు ఆడిన క్రికెటర్లు గా రికార్డులకెక్కారు. మిథాలీ వీరిని అధిగమించి కొత్త చరిత్రను సృష్టించింది.
మొత్తంగా ప్రపంచ క్రికెట్ లో ఆరు వన్డే ప్రపంచకప్ లు ఆడిన మూడో క్రికెటర్ గా మిథాలీ రాజ్ రికార్డు పుటల్లో స్థానం ఏర్పరుచుకుంది. సచిన్ మాదిరే మిథాలీ కూడా.. పదహారేండ్ల వయసులోనే భారత జట్టు తరఫున ఆడటం విశేషం.
ఇక తన కెరీర్ లో 225 వన్డేలు ఆడిన మిథాలీ.. 7,632 పరుగులు చేసింది. 51.85 సగటుతో ఏడు సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు చేసింది. మహిళల వన్డే క్రికెట్ లో ఏడు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ మిథాలీ రాజ్ మాత్రమే..