టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే.. క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు
T20 World Cup 2022: ఈనెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యా ఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచకప్ మరో వారం రోజుల్లో మొదలుకానున్నది. ఇప్పటికే అగ్రశ్రేణి జట్లైన భారత్, ఇంగ్లాండ్ లు ఆస్ట్రేలియాలోనే తిష్టవేశాయి. ఆసీస్ కూడా ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ఆడుతున్నది. ఈనెల ప్రారంభంలోనే వెస్టిండీస్, శ్రీలంక కూడా అక్కడకు చేరాయి. త్వరలోనే మిగిలిన జట్లు కూడా ఆసీస్ కు రానున్నాయి.
అక్టోబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనుంది. ఇక 15 ఏండ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇండియా భావిస్తున్నది. మాజీ ఛాంపియన్లు ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ కూడా టైటిల్ వేటలో ముందున్నాయి. ఇంతవరకు ఒక్క ప్రపంచకప్ కూడా గెలవని దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ కూడా టైటిల్ పై కన్నేశాయి.
టీ20లలో ఏ జట్టు గొప్ప అనే విషయం తేల్చడానికి ఉండదు. క్షణాల్లో మ్యాచ్ గమనం మారిపోతుంది. ఓడుతుందనుకున్న జట్టు గెలుస్తుంది. గెలుస్తుందనుకున్న జట్టు దారుణంగా ఓడుతుంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేది ఎవరు..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతున్నది. దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
ఇదే విషయమై తాజాగా విండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తనదైన శైలిలో స్పందించాడు. రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడే జట్లు ఆస్ట్రేలియా-వెస్టిండీస్ అని తేల్చేశాడు. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరగడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు.
గేల్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రపంచకప్ ఫైనల్ ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతుందని నేను భావిస్తున్నా. అయితే విండీస్ జట్టుకు ఫైనల్ చేరడం అంత ఈజీ కాదు. కీరన్ పొలార్డ్, ఆండ్రూ రసెల్, డ్వేన్ బ్రావో వంటి ఆటగాళ్లు లేకుండా వెస్టిండీస్ ఈ ప్రపంచకప్ లో బరిలోకి దిగుతున్నది. కానీ ప్రస్తుత విండీస్ జట్టులో చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారు.
ఈ క్రికెటర్లు ప్రపంచంలో ఏ జట్టుకైనా కఠిన సవాళ్లు విసరగలరు. మ్యాచ్ సమయానికి పరిస్థితులను వాళ్లకు అనుకూలంగా మార్చుకోగలిగితే అప్పుడు విండీస్ ను ఆపడం ఎవరితరమూ కాదు..’ అని గేల్ తెలిపాడు.
ఇదిలాఉండగా.. ఆసీస్-విండీస్ మధ్య ఇటీవలే ముగిసిన రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో కరేబియన్ జట్టు ఒక్క మ్యాచ్ లో కూడా నెగ్గలేదు. తొలి మ్యాచ్ లో కొంచెం పోటీ ఇచ్చిన విండీస్.. రెండో మ్యాచ్ లో చేతులెత్తేసింది. దీంతో సిరీస్ 2-0తో ఆసిస్ వశమైంది.