నేను భారీ స్కోర్లు చేయడంలేదని నాక్కూడా తెలుసు.. కానీ.. : రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ తన బ్యాటింగ్, ఫామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్ లో రెండేండ్లుగా సెంచరీ చేయని రోహిత్.. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడం లేదు.
భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ అంతర్జాతీయ స్థాయిలో సెంచరీ చేయక సుమారు 50 ఇన్నింగ్స్ లు దాటింది. అతడు చివరిసారి సెంచరీ చేసింది 2021 ఇంగ్లాండ్ లో. ఆ ఏడాది భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా అక్కడ నాలుగో టెస్టులో రోహిత్ సెంచరీ బాదాడు. ఇంటర్నేషనల్ లెవల్ లో దీని తర్వాత అతడు సెంచరీ చేయలేదు.
వన్డేలలో అయితే రోహిత్ సెంచరీ చేసి నాలుగేండ్లకు పైనే అయింది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతడు 2019 జనవరి 19న బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో చివరిసారి సెంచరీ చేశాడు. 2021లో సారథిగా నియమించిన తర్వాత రోహిత్.. ఒత్తిడి వల్ల ఫామ్ కోల్పోయి తంటాలుపడ్డాడు. అడపాదడపా 70, 80లలోకి వస్తున్నా మూడంకెల స్కోరుకు మాత్రం చేరడం లేదు.
తన సహచర ఆటగాడు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కూడా మూడేండ్ల విరామం తర్వాత గతేడాది మళ్లీ సెంచరీల బాట పట్టిన విషయం తెలిసిందే. గతేడాది ఆఫ్గాన్ పై సెంచరీ చేసిన అతడు తర్వాత బంగ్లాపై ఒకటి, శ్రీలంక పై రెండు సెంచరీలు బాది ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో మరి రోహిత్.. శతక కరువు తీరేది ఎప్పుడు..? అని అతడి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఇదే విషయమై రోహిత్ స్పందించాడు. న్యూజిలాండ్ తో రాయ్‌పూర్ వేదికగా ముగిసిన రెండో వన్డే తర్వాత హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ‘నేను నా ఆటను మార్చుకుంటున్నాను. బౌలర్ల మీద ఎదురుదాడికి దిగి వారిపై ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తున్నా. నానుంచి భారీ స్కోర్లు రావడం లేదన్న విషయం నాకూ తెలుసు. కానీ నేను దాని గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు..
నా బ్యాటింగ్ పట్ల నేను హ్యాపీగానే ఉన్నా. నేను ఆడుతున్న విధానాన్ని కూడా నేను ఆస్వాదిస్తున్నా. భారీ స్కోర్లు నాకు చేరువలోనే ఉన్నాయన్న విషయం నాక్కూడా తెలుసు. త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరుతుంది..’అని అన్నాడు.
కాగా వన్డేలలో 29 సెంచరీలు చేసిన రోహిత్.. ఈ ఫార్మాట్ లో సచిన్ (49), కోహ్లీ (46), పాంటింగ్ (30) ల తర్వాత స్థానంలో ఉన్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే రోహిత్.. పాంటింగ్ ను అధిగమిస్తాడు. మొత్తంగా రోహిత్ కెరీర్ లో 41 సెంచరీలున్నాయి. ఇందులో మూడు డబుల్ సెంచరీలే కావడం గమనార్హం.