- Home
- Sports
- Cricket
- రోజుకు 24 కోడిగుడ్లు తింటా.. నా ఫిట్నెస్ సీక్రెట్ అదే : పాకిస్తాన్ పేసర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
రోజుకు 24 కోడిగుడ్లు తింటా.. నా ఫిట్నెస్ సీక్రెట్ అదే : పాకిస్తాన్ పేసర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
నెట్ బౌలర్ స్థాయి నుంచి పాకిస్తాన్ ప్రధాన పేసర్ గా ఎదిగిన రౌఫ్.. 2020లో వన్డే అరంగేట్రం చేసి 16 మ్యాచ్ లలో 29 వికెట్లు తీశాడు. 57 టీ20లలో 72 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే అతడు పాకిస్తాన్ లోని జియో న్యూస్ ఛానెల్ కు ఓ ఇంటర్వ్యూలో..

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన బౌలర్ గా ఉన్న హరీస్ రౌఫ్ గుర్తున్నాడా..? అదేనండి కొద్దిరోజుల క్రితం టీ20 ప్రపంచకప్ లో కోహ్లీ బాదుడుకు బలైన బౌలర్. అతడు వేసిన 19వ ఓవర్లో కోహ్లీ రెండు భారీ సిక్సులు బాదాడు. ఆ తర్వాత చాలా రోజుల వరకూ అతడు ఈ విధ్వంసాన్ని మరిచిపోలేదు.
అయితే ఆ మ్యాచ్ లో హరీస్ రౌఫ్ విఫలమైనా తర్వాత పుంజుకున్నాడు. నెట్ బౌలర్ స్థాయి నుంచి పాకిస్తాన్ ప్రధాన పేసర్ గా ఎదిగిన రౌఫ్.. 2020లో వన్డే అరంగేట్రం చేసి 16 మ్యాచ్ లలో 29 వికెట్లు తీశాడు. 57 టీ20లలో 72 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే అతడు పాకిస్తాన్ లోని జియో న్యూస్ ఛానెల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా రౌఫ్ తన డైట్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఫిట్నెస్ కోసం ఏ డైట్ ఫాలో అవుతావని టీవీ షోలో యాంకర్ ప్రశ్నించగా అప్పుడు రౌఫ్...‘నేను రోజుకు 24 కోడిగుడ్లను తింటా. పాకిస్తాన్ మాజీ పేసర్ అకిబ్ జావేద్ నాకు ఈ డైట్ చెప్పాడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో 8, లంచ్ లో 8, డిన్నర్ లోనూ 8 కోడిగుడ్లను తింటా.
నేను క్రికెట్ అకాడమీకి వెళ్లినప్పుడు అక్కడ గదుల్లోకి వెళ్తే నాకు విచిత్రంగా అనిపించింది. గదుల నిండా ఎగ్ ట్రేలు గుట్టలుగా పరిచి ఉన్నాయి. అవి చూసి అసలు నేను క్రికెట్ అకాడమీకి వచ్చానా..? లేక ఏదైనా పౌల్ట్రీ ఫారమ్ కు వచ్చానా..? అనిపించింది.
సీనియర్ స్థాయిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు 72 కిలోల బరువు ఉండేవాన్ని. అప్పుడు అకిబ్ నాకు ఈ డైట్ గురించి చెప్పాడు. దాంతో నేను ఈ డైట్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాను. ఫలితంగా ఇప్పుడు నేను నా ఎత్తుకు తగ్గ బరువు (82 కిలోలు)కు వచ్చాను. అకిబ్ డైట్ నా ఫిట్నెస్ కు చాలా సహకరించింది.
భారత జట్టు 2019లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు హరీస్ రౌఫ్ నెట్ బౌలర్ గా ఉండేవాడు. ఆ సమయంలో కోహ్లీ కూడా రౌఫ్ బౌలింగ్ పై ప్రశంసలు కురిపించాడు. ఆ సిరీస్ లో అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తనను బాగా ప్రోత్సహించేవాడని రౌఫ్ చెప్పాడు.
‘నేను ఎప్పుడు రవిశాస్త్రిని కలిసినా ఆయన నేను ఎలా ఎదిగాను అన్నదాని గురించే మాట్లాడతారు. నువ్వు నెట్ బౌలర్ స్థాయి నుంచి ఇప్పుడు పాక్ ప్రధాన పేసర్ గా ఎదిగిన వైనాన్ని ఆయన గుర్తు చేసుకుంటారు. నా ప్రదర్శన పట్ల ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తారు..’అని తెలిపాడు.