- Home
- Sports
- Cricket
- ఆ ఒక్కడితో అయ్యేది లేదు పొయ్యేది లేదు.. మరి మాక్కూడా బుమ్రా లేడు కదా : గంగూలీ ఘాటు వ్యాఖ్యలు
ఆ ఒక్కడితో అయ్యేది లేదు పొయ్యేది లేదు.. మరి మాక్కూడా బుమ్రా లేడు కదా : గంగూలీ ఘాటు వ్యాఖ్యలు
Asia Cup 2022: నేటి నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కాబోతున్న ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం కీలక పోరు జరగాల్సి ఉంది.

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కు ముందు దాయాది దేశాల పోరుకు రంగం సిద్ధమైంది. భారత్-పాకిస్తాన్ లు ఆదివారం జరుగబోయే మ్యాచ్ కోసం ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యాయి. అయితే ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ కు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ.
గాయం కారణంగా అఫ్రిది ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు, ఆ దేశపు అభిమానులంతా అఫ్రిది లేకపోవడం భారత్ కు కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై తాజాగా టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
shaheen
క్రికెట్ అనేది జట్టుగా ఆడే ఆట అని.. ఒక్క క్రికెటర్ మీద ఆధారపడి ఆడేది కాదని అన్నాడు. అఫ్రిది లేనంత మాత్రానా భారత్ కు ఒనగూరేదేమీ లేదని.. అలా చూస్తే భారత్ నుంచి కూడా జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లు లేరనే విషయాన్ని దాదా గుర్తుచేశాడు.
Shaheen Afridi
ఆసియా కప్ ప్రారంభానికి ముందు దాదా మాట్లాడుతూ.. ‘ఒక్క ప్లేయర్ వల్ల ఆటలో మార్పులు జరుగుతాయని నేను అనుకోను. క్రికెట్ అనేది టీమ్ వర్క్. టీమిండియా కూడా బుమ్రా లేడు. హర్షల్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు కదా..’ అని అన్నాడు.
అఫ్రిది తో పాటు మహ్మద్ వసీం జూనియర్ కూడా గాయాల కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకున్నారు. దీంతో భారత్ కు ప్రయోజనం చేకూరనుందని పాకిస్తాన్ మాజీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాదా పై విధంగా స్పందించాడు.
షహీన్ గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్ లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తో పాటు విరాట్ కోహ్లీ వికెట్లను తీశాడు. ఆ మ్యాచ్ లో అతడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. దీంతో అతడు ఆ జట్టుకు తురుపు ముక్క అయ్యాడు. ఈ ఏడాది ప్రపంచకప్ లో కూడా అతడే పాకిస్తాన్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. దీంతో అతడిపై ఆ దేశపు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇదిలాఉండగా.. ఆసియా కప్ లో భారత్, పాక్ లు ఫేవరేట్ అని అభిమానులు అంచనాలు కడుతున్న వేళ దాదా దీనిపై స్పందించాడు. టీ20లలో ఫేవరేట్ అని ఏ జట్టు ఉండదని.. ఆ రోజుకు ఎవరు బాగా ఆడితే వారే విజేతలని అన్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15లో గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందని ఎవరైనా ఊహించారా...? అని ప్రశ్నించాడు.