క్యాచ్ డ్రాప్, రనౌట్లు కాదు.. టీమిండియా ఓడిపోవడానికి ఆ బౌలరే కారణం : సునీల్ గవాస్కర్
T20 World Cup 2022: దక్షిణాఫ్రికాతో ఆదివారం ముగిసిన సూపర్-12 మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడానికి కారణం దారుణమైన బ్యాటింగ్ తో పాటు క్యాచ్ మిస్, రనౌట్లేనని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో ముగిసిన లో స్కోరింగ్ థ్రిల్లర్ లో దారుణ పరాభవం పొందింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓడటానికి బ్యాటింగ్ వైఫల్యంతో పాటు రనౌట్ ఛాన్స్ లను చేజార్చుకోవడం.. కీలక క్యాచ్ లను వదిలేయడం వంటివని తెలిసిందే. స్వయంగా భారత సారథి రోహిత్ శర్మ కూడా మ్యాచ్ అనంతరం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
కానీ భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఇవన్నీ (రనౌట్, క్యాచ్ మిస్) మ్యాచ్ లో సహజమే అని.. ఒక స్పిన్నర్ 4 ఓవర్లలో 43 పరుగులివ్వడమే ఆందోళనకరంగా ఉందని అన్నాడు. అశ్విన్ ను టార్గెట్ చేస్తూ గవాస్కర్ ఈ కామెంట్స్ చేశాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం గవాస్కర్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ లలో క్యాచ్ డ్రాప్ లు, రనౌట్ ఛాన్స్ లను కోల్పోవడం సర్వ సాధారణమే. ఎవరో ఒక ఆటగాడిని మనం నిందించడానికి వీళ్లేదు. అదృష్టం మీ వైపు లేనప్పుడు అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా క్యాచ్ లు డ్రాప్ చేస్తారు. రనౌట్లు మిస్ చేస్తారు..
కానీ వీటన్నికంటే ఈ మ్యాచ్ లో ప్రధాన సమస్య ఒక బౌలర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులివ్వడం. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో యుజ్వేంద్ర చాహల్ ను ఆడించి ఉండాల్సింది. అతడు దక్షిణాఫ్రికా తో మ్యాచ్ వరకు సిద్ధమయ్యేవాడు. కానీ టీమ్ మేనేజ్మెంట్ అతడిని బెంచ్ కే పరిమితం చేసింది..’ అని అన్నాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో అశ్విన్.. 4 ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి 3 ఓవర్లలో 25 పరుగులు అవసరముండగా.. అశ్విన్ వేసిన 18వ ఓవర్లో మిల్లర్ రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్ ను ముగించే దిశగా సాగాడు. పేసర్లు భువీ, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యాలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా స్పిన్నర్ గా ఉన్న అశ్విన్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇదే విషయాన్ని గవాస్కర్ ఎత్తిచూపాడు.
ఈ ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపిక చేసిన 15 మదంది సభ్యులలో అశ్విన్ తో పాటు యుజ్వేంద్ర చాహల్ ను ఎంపిక చేసినా అతడిని ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు అవకాశమివ్వలేదు. మూడు మ్యాచ్ లలో అతడు బెంచ్ కే పరిమితమయ్యాడు.
తొలి రెండు మ్యాచ్ లకు అక్షర్ పటేల్ ను ఆడించిన యాజమాన్యం.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు అతడి స్థానంలో దీపక్ హుడాను తీసుకొచ్చింది. అతడు కూడా ఈ మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. స్పిన్ బౌలింగ్ వేసే అతడితో రోహిత్ శర్మ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం.