టీమిండియాకు భారీ షాక్.. కివీస్‌తో పాటు కీలక ఆసీస్ సిరీస్‌కూ బుమ్రా అనుమానమే..?
Jasprit Bumrah: ఏదైనా సిరీస్ లకు ముందు బుమ్రాను ఎంపిక చేసి తర్వాత గాయపడ్డాడని రెస్ట్ ఇవ్వడం, మరో రెండు మూడు నెలల వరకూ బుమ్రా పత్తకు లేకుండా పోవడం ఏడాదికాలంగా ఆనవాయితీగా వస్తోంది.

టీమిండియా సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ పై బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. ఏదైనా సిరీస్ లకు ముందు అతడిని ఎంపిక చేసి తర్వాత గాయపడ్డాడని రెస్ట్ ఇవ్వడం, మరో రెండు మూడు నెలల వరకూ బుమ్రా పత్తకు లేకుండా పోవడంతో అసలు అతడు నిజంగానే ఫిట్నెస్ సాధిస్తున్నాడా..? లేదా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్ లో కూడా బుమ్రా ఆగమనం, నిష్క్రమణ అదే విధంగా సాగాయి. అంతకుముందే ప్రకటించిన జట్టులో జనవరి 3న అతడిని వన్డే టీమ్ లోకి తీసుకోవడం.. ఆ తర్వాత నాలుగు రోజులకు మళ్లీ అతడికి గాయమైందని తప్పించడం పలు అనుమానాలకు తావిచ్చింది.
ఎన్సీఏలో ఫిట్నెస్ సాధించాడని బుమ్రాను లంకతో వన్డే జట్టుకు ఎంపిక చేస్తే అతడు ఏదో బరువులు ఎత్తుతూ గాయపడ్డాడని చెప్పడం గమనార్హం. ఇదే కారణంతో అతడు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా బుమ్రాకు సంబంధించిన మరో విషయం టీమిండియా ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తున్నది.
లంకతో సిరీస్ నుంచి తప్పుకున్న బుమ్రా.. త్వరలోనే కివీస్ తో సిరీస్ తో పాటు ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరుగబోయే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడేది కూడా అనుమానమే అని బోర్డు వర్గాల సమాచారం.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘బుమ్రా న్యూజిలాండ్ తో సిరీస్ కు సెలక్షన్స్ కు అందుబాటులో ఉండడు. అతడు ఎన్సీఏలో రిహాబిటేషన్ లో ఉన్నాడు. కివీస్ తర్వాత ఆసీస్ తో జరుగబోయే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా బుమ్రా ఆడతాడా..? ఆడడా..? అనేది ఇప్పుడే చెప్పలేం. బుమ్రా కోలుకోవడానికి నెల రోజుల దాకా పట్టొచ్చు. ఆ తర్వాతే అతడి ఫిట్నెస్ పై ఓ నిర్ణయానికి రాగలం..’అని చెప్పాడు.
షెడ్యూల్ ప్రకారం భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ వచ్చే నెల 9 నుంచి మొదలుకావాల్సి ఉంది. ఫిబ్రవరి 9-13 మధ్య తొలి టెస్టు జరుగనుండగా.. 17-21 మధ్య రెండో టెస్టు, మార్చి 1-5 వరకూ మూడో టెస్టు, 9-13 మధ్య నాలుగో టెస్టు జరుగుతుంది. బుమ్రా ప్రస్తుత పరిస్థితి చూస్తే అతడు కోలుకోని ఫిట్నెస్ సాధించడానికి నెలన్నర సమయం పట్టినా ఆసీస్ తో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడు.