- Home
- Sports
- Cricket
- Virat Kohli: క్రికెట్ మానేయ్.. బీచ్ లో కూర్చో.. కోహ్లి పై ఇంగ్లాండ్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్
Virat Kohli: క్రికెట్ మానేయ్.. బీచ్ లో కూర్చో.. కోహ్లి పై ఇంగ్లాండ్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్
Virat Kohli: గడిచిన రెండున్నరేండ్లుగా పాత ఫామ్ కోల్పోయి తంటాలుపడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లిపై ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి రెస్ట్ తప్పదా..? గత కొన్నాళ్లుగా చాలామంది క్రికెట్ విశ్లేషకులు, సీనియర్ క్రికెటర్లు కోహ్లి కొద్దిరోజులు క్రికెట్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖెల్ వాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ ఎడ్జబాస్టన్ టెస్టులో కూడా (రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 31 పరుగులు) విఫలమైన కోహ్లి ఆటపై వాన్ స్పందిస్తూ.. ‘నేను గత కొద్దిరోజులుగా విరాట్ ఆటను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాను. నాకు తెలిసి అతడు కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటే మంచిది.
ఓ మూడు నెలల పాటు క్రికెట్ ను పూర్తిగా వదిలేసి కుటుంబంతో గడపు. వాళ్లతో ఎలా ఎంజాయ్ చేయాలని అనిపిస్తే అలా చెయి.. క్రికెట్ ను ఆడటం, చూడటం మానేసి బీచ్ లో కూర్చో. మూడు నెలల విశ్రాంతి కోహ్లిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అతడు తిరిగి ఫామ్ ను పుంజుకుంటాడు..’ అని వాన్ సలహా ఇచ్చాడు.
Image credit: Getty
గడిచిన రెండున్నరేండ్లుగా అంతర్జాతీయ కెరీర్ లో సెంచరీ చేయలేక తంటాలు పడుతున్న కోహ్లి తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కూడా దారుణంగా దిగజారాడు. టాప్-10లో చోటు కోల్పోయి 13వ స్థానానికి పడిపోయాడు.
2016 నుంచి టాప్-10లో ఉంటున్న కోహ్లి, ఈ జాబితాలో చోటు కోల్పోవడం ఇదే ప్రథమం. ఈ రెండున్నరేండ్లలో అతడి కంటే చాలా దూరం వెనక ఉన్న ఆటగాళ్లెందరో కోహ్లిని దాటేసి వెళ్తున్నారు. కానీ అతడు మాత్రం ఇంకా అదే పేలవ ఫామ్ ను కొనసాగిస్తుండటంతో కోహ్లికి విశ్రాంతి తప్పదని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక తాజాగా ఇంగ్లాండ్ తో జరుగబోయే టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కోహ్లి భవితవ్యాన్ని ఖరారు చేయనుంది. ఇంగ్లాండ్ తో ఆడబోయే రెండు టీ20లలో రాణించకుంటే కోహ్లి పై వేటు తప్పదని సెలక్టర్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అతడెలా ఆడతాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.