- Home
- Sports
- Cricket
- నువ్వు నన్ను మళ్లీ బ్యాట్ పట్టేలా చేస్తున్నావ్..! దినేశ్ కార్తీక్ పై మిస్టర్ 360 ఆసక్తికర వ్యాఖ్యలు
నువ్వు నన్ను మళ్లీ బ్యాట్ పట్టేలా చేస్తున్నావ్..! దినేశ్ కార్తీక్ పై మిస్టర్ 360 ఆసక్తికర వ్యాఖ్యలు
TATA IPL 2022: ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భీకరమైన బ్యాటింగ్ తో దుమ్ము రేపుతున్నాడు. తాజాగా అతడి ప్రదర్శనపై మిస్టర్ 360 స్పందించాడు.

ఐపీఎల్-15లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అదిరిపోయే ప్రదర్శనలు చేస్తూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫినిషర్ అనే పదానికి సరైన అర్థాన్నిస్తూ అదరగొడుతున్న దినేశ్ కార్తీక్ ఫర్ఫార్మెన్స్ తాజాగా ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను కూడా ఆకట్టుకుంది.
మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ మ్యాచ్ కు ముందు ఈ మిస్టర్ 360 స్పందిస్తూ.. అతడి ఆటను చూస్తే తాను ఐపీఎల్ వదిలేసినందుకు బాధపడుతున్నానని, మరోసారి బ్యాట్ పట్టాలని ఉందని చెప్పుకొచ్చాడు.
డివిలియర్స్ స్పందిస్తూ.. ‘అతడు (దినేశ్ కార్తీక్) ఆర్సీబీ తరఫున ఇప్పటికే పలు మ్యాచులు గెలిపించాడు. తన కెరీర్ లోనే అత్యంత సూపర్ ఫామ్ లో ఉన్నాడనిపిస్తున్నది. అసలు ఆ ఆట ఎక్కడినుంచి వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు.
ఎందుకంటే గతంలో దినేశ్ ఇంతలా రెచ్చిపోయిన సందర్బాన్ని నేనైతే చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అతడు బాగా ఆడుతున్నాడు. గ్రౌండ్ కు నలువైపులా 360 డిగ్రీల కోణంలో ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు.
కార్తీక్ ను చూస్తుంటే నేను క్రికెట్ కు త్వరగా రిటైర్మెంట్ చెప్పానా..? అనిపిస్తున్నది. నేను మళ్లీ బ్యాట్ పట్టి క్రీజులోకి రావాలని అనిపిస్తున్నది. తీవ్ర ఒత్తిడి మధ్య మిడిలార్డర్ లో బ్యాటింగ్ వచ్చి దుమ్ము దులపాలని ఉత్సాహంగా ఉంది. అతడు ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే ఆర్సీబీ తప్పకుండా ట్రోఫీ కొట్టగలదని ఆశిస్తున్నాను...’ అని అన్నాడు.
కాగా.. ఈ సీజన్ లో కార్తీక్ ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడి 210 పరుగులు చేశాడు. పంజాబ్ తో ఆడిన తొలి మ్యాచ్ లో 14 బంతులలోనే 32 రన్స్ కొట్టిన అతడు.. తర్వాత కూడా రాజస్తాన్ (44), ఢిల్లీ (34 బంతుల్లో 64), చెన్నై (14 బంతుల్లో 34) వంటి జట్లపై కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఫాఫ్ డుప్లెసిస్ (96) రాణించడంతో బెంగళూరు.. రాహుల్ సేనపై 18 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్ జోష్ హెజిల్వుడ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.