- Home
- Sports
- Cricket
- పరుగులైతే చేస్తున్నాడేమో గానీ కోహ్లిలో అది కరువైంది.. టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
పరుగులైతే చేస్తున్నాడేమో గానీ కోహ్లిలో అది కరువైంది.. టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Aakash Chopra Comments on Virat Kohli: పరుగుల యంత్రంగా పేరు గడించిన విరాట్ కోహ్లి.. కెప్టెన్సీ, ఇతర కారణాల రీత్యా గతంలో మాదిరి ఆడలేకపోతున్నాడనేది అతడి అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ చెప్పే మాట.. కానీ..

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి సెంచరీ చేసి సుమారు రెండేండ్లు కావస్తున్నది. కెప్టెన్సీ బాధ్యతలు నుంచి విముక్తి పొందాక కోహ్లి ఇక మళ్లీ సెంచరీల మోత మోగించడం ఖాయమని అనుకున్నారంతా..
కానీ దక్షిణాఫ్రికా తో ముగిసిన వన్డే సిరీస్ లో కోహ్లి.. తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. మూడు మ్యాచుల ఆ సిరీస్ లో రెండో వన్డేలో డకౌట్ అయిన కోహ్లి.. తొలి, మూడో వన్డేలలో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడే గానీ ఆ అర్థ శతకాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు.
త్వరలో విండీస్ తో జరిగే వన్డే సిరీస్ లో అయినా కోహ్లి 71 వ శతకం చేయాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్య బాధ్యతలు ముగిసిన తర్వాత కోహ్లి పరుగులు సాధిస్తున్నాడు గానీ.. మునపటి ఆటతీరు లేదని చెప్పాడు.
ఓ స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా మాట్లాడుతూ.. ‘ఆ హాఫ్ సెంచరీలను అతడు (కోహ్లి) సెంచరీలుగా మలుచుకోవాలి. గతంలో మీరు పరుగుల వరద పారించిన రోజులను మరిచిపోవద్దు. అతడు ఫామ్ కోల్పోలేదు. కానీ పాత విరాట్ కోహ్లిని మనం చూడటం లేదు.
గతంలో విరాట్ ఆడే సమయంలో బౌలర్లపై ఆధిక్యత ప్రదర్శించేవాడు. పరుగుల కోసం ఆకలిగొన్న పులిలా వేటాడేవాడు. కానీ కొంతకాలంగా కోహ్లిలో అది కనిపించడం లేదు. సచిన్, ద్రావిడ్ మాదిరిగా నెమ్మదిగా పరుగులు కూడగట్టడం కాదు. అతడు ఆధిక్యం చెలాయించే వ్యక్తి. అలాంటి కోహ్లి మళ్లీ బయటకు రావాలి...’ అని చోప్రా అన్నాడు.
ఇక విండీస్ తో వచ్చే వన్డే సిరీస్ లో తొలిసారి హిట్ మ్యాన్ సారథ్యంలో ఆడబోతున్న విరాట్... తనదైన ముద్ర వేయాలని చోప్రా అన్నాడు. ఈ ఇద్దరి శైలి వేరైనా సారథిగా రోహిత్ శర్మ తన అధికారిక ముద్రను వేయాలనుకుంటాడని, దానికనుగుణంగా కోహ్లి కూడా ఆడాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు.