కెప్టెన్సీ వదిలేయడం వల్లే ఇదంతా : కోహ్లీపై మిస్టర్ 360 ఇంట్రెస్టింగ్ కామెంట్స్
IPL 2023: రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మునపటి ఫామ్ ను అందుకుని మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే ఏడాది క్రితం వరకు మాత్రం పరిస్థితి ఇలా ఉండేది కాదు.

2019 తర్వాత ఫామ్ కోల్పోయి సుమారు మూడేండ్ల పాటు తన కెరీర్ లోనే అత్యంత గడ్డు కాలం గడిపిన ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ గతేడాది ఆగస్టు నుంచి మళ్లీ మునపటి ఫామ్ ను అందుకుని వీరవిహారం చేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ తన అత్యుత్తమ ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు.
గతంలో మాదిరిగా కాకుండా కోహ్లీ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడని, అతడి మోముపై నిత్యం నవ్వు కనిపిస్తుందని అంటున్నాడు ఆర్సీబీ మాజీ ఆటగాడు, అభిమానులు ముద్దుగా ‘మిస్టర్ 360’ అని పిలుచుకునే ఏబీ డివిలియర్స్. కెప్టెన్సీ వదిలేయడం వల్లే అతడు ఇంత హ్యాపీగా ఉన్నాడని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల తనను కలిసిన విలేకరులతో డివిలియర్స్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చాలాకాలంగా కోహ్లిని చూస్తున్న మీకు.. అతడిలో ఏమైనా మార్పు కనిపించిందా..? అని విలేకరులు అడిగని ప్రశ్నకు కోహ్లీ సమాధానమిస్తూ... ‘లేదు. నేనైతే కోహ్లీలో ఎలాంటి మార్పునూ చూడలేదు.
టెక్నిక్ అలాగే బలంగా ఉంది. క్రీజులో చక్కగా కదులుతున్నాడు. ఇప్పటికీ అతడు బిజీ ప్లేయరే. ఇటీవల కోహ్లీ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో చూస్తే అతడు చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటున్నాడు. కెప్టెన్సీ వదిలేయడం వల్లే ఇదంతా అని నేను అనుకుంటున్నా.
Image credit: PTI
భారత జట్టుతో పాటు ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నన్ని రోజులు అతడి మీద తీవ్ర ఒత్తిడి ఉండేది. సారథ్య బాధ్యతల వల్ల అతడు తన ఫ్రెండ్స్, కుటుంబంతో ఎక్కువగా గడపలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలేమీ లేవు. అందుకే కోహ్లీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. కోహ్లీ సరదాగా ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయి...’అని చెప్పాడు.
కాగా ఐపీఎల్-16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కోహ్లీ రెచ్చిపోయాడు. ముంబై నిర్దేశించిన 170 ప్లస్ టార్గెట్ ను డుప్లెసిస్ తో కలిసి అలవోకగా ఛేదించాడు. ఈ మ్యాచ్ లో 82 పరుగులతో కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. ఇక ఐపీఎల్ లో ఆర్సీబీ.. నేడు కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.