అతడు సర్వాంతర్యామి.. ధోనిపై విరాట్ పోస్ట్ వైరల్
చూడటానికి గురు-శిశ్యులా బంధంలా కనిపించినా ధోనిని కోహ్లీ తన సోదరుడిగా భావిస్తాడు. ధోని సారథ్యంలో కోహ్లీ ఎన్నో మైలురాళ్లు నెలకొల్పాడు. తనకు ధోని ఎంత స్పెషలో కోహ్లీ చాలా సందర్భాలలో మీడియా వేదికగా తెలిపాడు.
భారత క్రికెట్ లో ప్రొఫెషనల్ గానే గాక కుటుంబాలతో సాన్నిహిత్యంగా మెలిగే ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. ఏదో పార్టీలలో, ప్రత్యేక కార్యక్రమాలలో తప్ప ఆటగాళ్ల కుటుంబాలు కలవడం చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ టీమిండియా మాజీ సారథులు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిలు మాత్రం అలా కాదు. ఈ ఇద్దరిదీ ఆటకు మించిన బంధం.
తాజాగా కోహ్లీ మరోసారి ధోనిపై అభిమానాన్ని చాటుకున్నాడు. ఓ వాటర్ బాటిల్ మీద ధోని ఉన్న ఫోటోను చూపిస్తూ.. ‘అతడు ఎక్కడైనా ఉంటాడు..’అని రాసుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ ముగిశాక ఉత్తరాఖండ్ కు తీర్థయాత్రలకు వెళ్లిన కోహ్లీ.. ఆధ్యాత్మిక మార్గం పట్టాడు.
ఈ సందర్భంగా కోహ్లీ ఓ వాటర్ బాటిల్ మీద ధోని ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు. సదరు వాటర్ బాటిల్ బ్రాండ్ కు ధోని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అది కాస్తా కోహ్లీ కంటపడింది. దాంతో కోహ్లీ.. ‘అతడు (ధోని) ఎక్కడైనా ఉంటాడు. వాటర్ బాటిల్ మీద కూడా..’ అని ఫన్నీగా రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలాఉండగా ధోని-కోహ్లీల బంధం గురించి ఇటీవలే మాజీ భారత సారథి మాట్లాడుతూ.. తాను ఫామ్ లేమితో తంటాలు పడుతున్నప్పుడు ఆదుకున్నవారు ఎవరూ లేరని.. ఒక్క ధోని మాత్రం తనకు ధైర్యం చెప్పాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తాజాగా విడుదల చేసిన పోడ్‌కాస్ట్ లో కోహ్లీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు నిజంగా మద్దతునిచ్చింది ఎంఎస్ ధోని. ధోనితో నాకు స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉంది. అది ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువగా పరస్పర గౌరవం అని నేను చెప్పగలను. నేను ఫామ్ లేమితో తంటాలు పడుతున్నప్పుడు ధోని నాకు ఒక మెసేజ్ చేశాడు.
ఆ మెసేజ్ లో ధోని.. ‘నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉండాలని అనుకుంటున్నావో.. అంతే బలంగా కనిపించాలి. ప్రజలు నువ్వు ఎలా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారని అడగడం మరిచిపోతారు’ అని నాకు చెప్పాడు. అది నాకు చాలా బలంగా తాకింది. నాకు కావాల్సిన ప్రోత్సాహం కూడా ఇదే కదా అనిపించింది..’ అని అన్నాడు.