ఆ ఓవరాక్షనే వద్దనేది.. హారిస్ రౌఫ్ భార్యకు దిమ్మదిరిగింది !
Haris Rauf Controversy: ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. అయితే, ఈ మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ వివాదాస్పద హావభావాల తర్వాత అతని భార్య మరోసారి రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. దీంతో పాక్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.

భారత్–పాక్ పోరులో కొత్త వివాదం
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా మరోసారి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. అయితే ఆటలో కంటే ఆటగాళ్ల ప్రవర్తన, అభిమానుల ప్రతిస్పందనలు ఎక్కువగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ చేసిన హావభావాలు ఆన్‌లైన్‌లో పెద్ద దుమారమే రేపాయి. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆయన చేసిన సంకేతాలు భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాయి. అలాగే, అభిషేక్ శర్మతో కూడా గొడపడే విధంగా నడుచుకున్నాడు. దీంతో అభిషేక్ పాక్ బౌలింగ్ ను దంచికొట్టాడు.
హరీస్ రౌఫ్ భార్య ముస్జా ఘాటుగానే ఇచ్చిపడేసిన క్రికెట్ ఫ్యాన్స్
మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన ప్రదర్శనపై గర్వంగా ఉందని హారిస్ రౌఫ్ భార్య ముస్జా మనూఫ్ కామెంట్స్ చేయడంతో ఈ రచ్చ మరింత ముదిరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో “గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం” అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీమిండియా అభిమానులు స్పందిస్తూ.. ఆమెకు ఘాటుగానే సమాధానమిస్తున్నారు. మీ బుద్ధి ఎప్పటికీ మారదు అని ఎత్తిచూపారు. అలాగే, యుద్ధమైనా, ఆటైనా గేలిచేది భారత్.. ఓడిపోయేది పాకిస్తాన్ అంటూ చురకలంటిస్తున్నారు. క్రీడల్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఇలా చేయడం పై క్రికెట్ లవర్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి.
హారిస్ రౌఫ్ కు కౌంటరిచ్చిన భారత ఫ్యాన్స్
పాక్ ప్లేయర్ల తీరుతో ప్రేక్షకులు “కోహ్లీ.. కోహ్లీ” అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో హరీస్ రౌఫ్ కోపంతో రెచ్చిపోయాడు. చేతి సంకేతాల ద్వారా 6 చూపిస్తూ సంజ్ఞలు చేశాడు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఇవి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత యుద్ధ విమానాలను కూల్చామని పాక్ ఆర్మీ చేసిన ఆరోపణలకు సంకేతంగా ఉన్నట్లు కనిపించాయి. దీంతో ఆయన ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హారిస్ రౌఫ్ కు దిమ్మదిరిగే కౌంటరిచ్చిన టీమిండియా ఫ్యాన్స్
హారిస్ రౌఫ్ రెచ్చగొట్టే సంకేతాలకు టీమిండియా అభిమానులు తమదైన శైలిలో సమాధానం చెప్పారు. టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లి వరుసగా రెండు సిక్సర్లు బాదిన సన్నివేశాన్ని గుర్తు చేస్తూ స్టాండ్స్ అంతా “కోహ్లీ.. కోహ్లీ” అంటూ మార్మోగింది. రౌఫ్ 6 చూపించగా, భారత అభిమానులు 7 తో కౌంటర్ ఇచ్చారు. గత ఏడు భారత్ - పాక్ పోరులో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదన్న నిజాన్ని గుర్తు చేశారు.
మరోసారి భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. భారత్ 18.5 ఓవర్లలోనే 174/4 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (74), శుభ్‌మన్ గిల్ (47) అద్భుతంగా టీమిండియాను విజయం వైపు నడిపించారు. చివర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పరుగులు జోడించడంతో భారత్ సునాయాసంగా గెలిచింది. ఈ విజయంతో ఆసియా కప్ ఫైనల్ దిశగా టీమిండియా బలమైన అడుగు వేసింది.