ఆసియా కప్ ఫైనల్ టికెట్ కోసం టీమిండియా ఫైట్.. హార్దిక్ పాండ్యా కొత్త రికార్డు
Asia Cup 2025: ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.

భారత్ vs బంగ్లాదేశ్ బిగ్ ఫైట్
ఆసియా కప్ 2025 సూపర్-4లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన భారత జట్టు బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
హార్దిక్ పాండ్యా ముందు సూపర్ రికార్డు
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో ప్రత్యేక రికార్డు సాధించనున్నాడు. పాండ్యా ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్‌లో 97 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌పై 3 వికెట్లు సాధిస్తే, 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనతను సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఈ టోర్నమెంట్ లో అర్షదీప్ సింగ్ 100 వికెట్ల రికార్డును అందుకున్నాడు. ఆయన ఈ ఆసియా కప్‌లోనే ఒమన్‌పై 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
ఆసియా కప్ 2025లో హార్దిక్ ప్రదర్శన
హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 118 మ్యాచ్‌లు ఆడి, 26.63 సగటుతో 97 వికెట్లు తీశాడు. భారత్ తరఫున రెండవ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు సాధించాడు. పాకిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
టీ20 లో టాప్ భారత బౌలర్లు
టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో అర్షదీప్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన 64 మ్యాచ్‌లలో 100 వికెట్లు తీశాడు. రెండో స్థానంలో హార్దిక్ పాండ్యా 97 వికెట్లతో ఉన్నాడు. యూజ్వేంద్ర చహల్ 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 73 మ్యాచ్‌లలో 92 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్‌లలో 90 వికెట్లు తీశారు. అంతర్జాతీయ స్థాయిలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ 103 మ్యాచ్‌లలో 173 వికెట్లు తీసి టాప్ లో కొనసాగుతున్నాడు.
ఆసియా కప్ 2025 ఫైనల్ కు భారత్
ఆసియా కప్ 2025 భారత జట్టు ఫైనల్ కు చేరడానికి మరో అడుగు దూరంలో ఉంది. బంగ్లాదేశ్ లేదా శ్రీలంక టీమ్ లలో ఒక జట్టును ఓడిస్తే నేరుగా ఫైనల్ బరిలోకి అడుగుపెడుతుంది. రెండు మ్యాచ్‌లలో ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. భారత్ ఓడిపోతే శ్రీలంకకు అవకాశాలు ఇంకా ఉంటాయి. అయితే, ప్రస్తుత పరిస్థితిలో భారత్ ఓడే అవకాశం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ లో ఇతర జట్లతో పోలిస్తే టీమిండియా చాలా బలంగా ఉంది.