ఐపీఎల్‌లో ఈ ఒక్క రికార్డు మాత్రం రోహిత్‌కే సొంతం.. బ్రేక్ చేయడం కూడా కష్టమే!
Happy Birthday Rohit Sharma: ఐపీఎల్ లో వందలాది మంది ఆటగాళ్లు వేలాది పరుగులు చేసినా రోహిత్ శర్మకు ఎవరూ సాధ్యం కాని రికార్డును సాధించుకున్నాడు.

టీమిండియా సారథి రోహిత్ శర్మ రేపు (ఏప్రిల్ 30న) 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతున్న వారిలో హిట్‌మ్యాన్ కూడా ఒకడు. కాగా ఐపీఎల్ లో ఆరు వేల పరుగులు చేసిన రోహిత్ కు ఓ అరుదైన ఘనత ఉంది. 16 సీజన్లుగా మరే ఇతర ప్లేయర్ కూ ఆ రికార్డు లేదు.
బ్యాచ్‌లర్‌గా, భర్తగా, తండ్రిగా ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ మాత్రమే. ముంబై ఇండియన్స్ కు మారకముందు రోహిత్.. డెక్కన్ ఛార్జర్స్ కు ఆడిన విషయం తెలిసిందే.
2009లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అప్పటికీ రోహిత్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. 2008 సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి 12 ఇన్నింగ్స్ లలో 404 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. 2009 సీజన్ లో కూడా 16 మ్యాచ్ లలో 362 రన్స్ సాధించాడు.
Image credit: Instagram
ఇక 2012 నుంచి ముంబైకి ఆడుతున్న రోహిత్.. 2013 లో ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టాడు. ఆ ఏడాది ముంబై ఫస్ట్ టైటిల్ గెలిచింది. అదీ అతడి సారథ్యంలోనే. అప్పటికీ రోహిత్ కు పెళ్లి కాలేదు. 2015లో కూడా ముంబై కప్ కొట్టింది. అదే ఏడాది డిసెంబర్ లో రోహిత్.. రితికా సజ్డేను వివాహమాడాడు.
బ్యాచ్‌లర్ గా టైటిల్ నెగ్గిన రోహిత్ శర్మ.. పెళ్లయ్యాక కూడా 2017లో ముంబై ఇండియన్స్ కు ట్రోఫీ గెలిచాడు. ఇక తండ్రిగా కూడా హిట్‌మ్యాన్ కప్ కొట్టాడు. 2019లో ముంబై నాలుగో సారి కప్ గెలిచింది. అప్పటికే రోహిత్ తండ్రి అయ్యాడు.
కాగా 2020 నాటికి ఐపీఎల్ ట్రోఫీని బేసి సంఖ్యల సంవత్సరాలలో గెలిచిన ఆటగాడు కూడా రోహిత్ ఒక్కడే. ఐపీఎల్ లో రోహిత్ 2009, 2013, 2015, 2017, 2019 లలో కప్ కొట్టాడు. 2020లో దీనికి ఫుల్ స్టాప్ పడింది.