స్టార్ ప్లేయర్ కు షాకిచ్చిన గుజరాత్.. షమీ ఏం చేస్తాడో మరి?
IPL 2025 Retention: హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ 2022లో తన తొలి సీజన్ లో ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాతి సీజన్ లో రన్నరప్‌గా నిలిచింది. 2024 లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్ కోసం ప్లేయర్ల రిటెన్షన్ ను సిద్ధం చేసింది.
Shubman Gill, Gujarat Titans
IPL 2025 Retention: ఐపీఎల్ మెగా వేలానికి ముందు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఎడమచేతి వాటం బ్యాటర్ సాయి సుదర్శన్‌లతో కలిసి గుజరాత్ టైటాన్స్ తమ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది. అన్‌క్యాప్డ్ హిట్టర్లు రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్‌లను కూడా ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకోవాలని భావిస్తోందని సమాచారం.
ఇప్పటికే శుభ్ మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్ లను గుజరాత్ ఫ్రాంచైజీ రిటైన్ చేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ లో భారత క్రికెట్ సెటప్‌లో భవిష్యత్ నాయకుడిగా కనిపించే శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో ఆడిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో 10 జట్లలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
భారీ అంచనాల నడుమ 8వ స్థానంలో నిలిచింది. అంతకుముందు గుజరాత్ టైటాన్స్ తన తొలి సీజన్ లోనే ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో రెండో సారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. హార్దిక్ పాండ్యా టీమ్ ను వీడటంతో శుభ్ మన్ గిల్ కు కెప్టెన్సీని అప్పగించింది గుజరాత్ టీమ్.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ప్లేయర్ల రిటెన్షన్ వివరాలను అందించాలని బీసీసీఐ ఈ నెలాఖరును గడువుగా విధించింది. ఈ క్రమంలోనే లిస్టును సిద్ధం చేసే పనిలో ఉన్నాయి అన్ని ఫ్రాంఛైజీలు. ఇక గుజరాత్ టైటాన్స్ రషీద్‌ను కొనసాగించాలనే నిర్ణయం కూడా ఆశించిన స్థాయిలోనే ఉంది. 26 ఏళ్ల అతను 2022లో జట్టుతో తన తొలి సీజన్‌లో 19 వికెట్లు పడగొట్టాడు. తర్వాత సీజన్‌లో 27 వికెట్లు సాధించాడు. ఆ తర్వాతి సీజన్ లో 12 గేమ్‌లలో 36.70 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు.
Mohammed Shami-Jasprit Bumrah
ఇక సుదర్శన్ ఆడిన 12 మ్యాచ్ లలో ఒక సెంచరీతో పాటు 527 పరుగులు చేసిన అతన్ని జట్టుతోనే అంటిపెట్టుకోవాలని గుజరాత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ యంగ్ బ్యాటర్ భారత జాతీయ జట్టు తరఫున మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ను కూడా ఆడాడు.
అలాగే, అన్‌క్యాప్డ్ ప్లేయర్ షారుక్ ఖాన్ 169.33 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అతన్ని కూడా గుజరాత్ ఫ్రాంఛైజీ రూ.4 కోట్లతో జట్టుతోనే ఉంచుకోవాలని భావిస్తోంది. దాదాపు 100 మ్యాచ్‌లు ఆడిన ఐపీఎల్ వెటరన్ తెవాటియా, టైటాన్స్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తున్న మరో బ్యాటర్. ఈ యంగ్ ప్లేయర్ గత సీజన్‌లో 145 ప్లస్ స్ట్రైక్‌తో బ్యాటింగ్ చేశాడు.
Mohammed Shami
అయితే, అనూహ్యంగా భారత స్టార్ ప్లేయర్ పేరు గుజరాత్ రిటెన్షన్ లిస్టులో కనిపించలేదు. అతనే స్టార్ పేసర్ మహ్మద్ షమీ. వన్డే ప్రపంచ కప్ నుంచి షమీ గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీమిండియా టెస్టు సిరీస్ లో కనిపిస్తాడని భావించారు. కానీ, అతను ఇంకా పూర్తి ఫిట్ నెస్ ను సాధించలేదనే రిపోర్టుల మధ్య అతను గ్రౌండ్ లోకి అడుగుపెట్టడానికి మరింత సమయం పట్టే అవకాశముంది.
ఇదిలావుండగా, నవంబర్ చివరి వారంలో ఓవర్సీస్ లో మెగా వేలం జరిగే అవకాశం ఉందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతేడాది వేలంలో జట్ల వద్ద ఉండే రూ.100 కోట్ల పర్సును ఈ సారి రూ.120 కోట్లకు పెంచారు. అలాగే, ప్లేయర్ల రిటైన్ విషయంలో కూడా మార్పులు చేశారు. మొత్తం ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు.
ఇదిలావుండగా, గుజరాత్ టైటాన్స్ తొలి రిటెన్షన్ పేరు అందరూ కెప్టెన్ గిల్ అనుకున్నారు. కానీ, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సేవలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ తమ తొలి రిటెన్షన్ గా అతన్నే తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం. 2022లో జట్టు మొదటి సీజన్ నుండి గుజరాత్ తో కొనసాగుతున్నాడు. రాబోయే సీజన్ లలో మెరుగైన ప్రదర్శనలు ఇవ్వడం కోసం తన పర్సులో కోత పెట్టే విషయంలో గిల్ కూడా ఫ్రాంఛైజీ నిర్ణయానికి ఒకే చెప్పినట్టు పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.