వెళ్లి అతనితో మాట్లాడు... అతను ఉన్నది అందుకే... ఛతేశ్వర్ పూజారాకి సునీల్ గవాస్కర్ సలహా...
బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు అద్భుత విజయం అందుకున్నా, టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ కావడం కలవరపెడుతున్న అంశం. పూజారా రాణిస్తే మిగిలిన బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి, పరుగులు చేయడం పూజారాలో ఉన్న స్పెషాలిటీ. కొన్నాళ్లుగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న పూజారా, తిరిగి ఫామ్‌ను అందుకోవాలంటే భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో మాట్లాడాలని సలహా ఇచ్చాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... ఆ తర్వాత ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో 20+ పరుగులు కూడా చేయలేకపోయాడు...
రెండు టెస్టుల్లో కలిపి కేవలం 63 పరుగులు మాత్రమే చేసిన ఛేతేశ్వర్ పూజారా... తిరిగి ఫామ్ అందుకోవాలంటే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో మాట్లాడాలని సూచించాడు సునీల్ గవాస్కర్...
‘పూజారా వెళ్లి బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో మాట్లాడాలి... ఇప్పుడు నేను అతనికి ఇది మాత్రమే చెప్పగలను... ఎందుకంటే బ్యాటింగ్ కోచ్‌ను నియమించేది అందుకే...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
‘ఆడిలైడ్‌లో అతను కొన్ని బ్యూటీఫుల్ షాట్స్ ఆడాడు... మెల్‌బోర్న్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఇదే చేయగలడు... కానీ రెండో ఇన్నింగ్స్‌లో అతని క్యారెక్టర్‌కి సూట్ అవ్వని షాట్ ఆడి అవుట్ అయ్యాడు పూజారా...
ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ నిర్మించే పూజారా... ప్రారంభంలోనే ఇలాంటి షాట్ ఆడి అవుట్ అవుతాడని ఎవ్వరూ ఊహించరు...
తన బ్యాటింగ్‌లో ఎక్కడ లోపం జరుగుతుందో తెలియాలంటే బ్యాటింగ్ కోచ్‌తో మాట్లాడాలి...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్.
మొదటి రెండు టెస్టుల్లో రాణించకపోయినా మయాంక్ అగర్వాల్‌కి మరో అవకాశం ఇవ్వాలని సూచించాడు సునీల్ గవాస్కర్...
సిడ్నీ టెస్టులో మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాలని,శుబ్‌మన్ గిల్ మిడిల్ ఆర్డర్‌లో రావాలని సూచించిన సునీల్ గవాస్కర్, తెలుగు కుర్రాడు హనుమ విహారిని తప్పించాలని చెప్పాడు...
అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా సిడ్నీ టెస్టులో ఓపెనర్ డేవిడ వార్నర్‌ను బరిలో దింపాలని చూస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. అతనితో పాటు పుకోవిస్కీ రూపంలో ఓ బ్యాట్స్‌మెన్, అబ్బాట్ రూపంలో ఓ బౌలర్ ఆసీస్ జట్టులోకి రానున్నారు.
ఆస్ట్రేలియా జట్టుకు సమానంగా భారత జట్టు పటిష్టం కావాలంటే కెఎల్ రాహుల్‌కి కూడా తుది జట్టులో చోటు కల్పించాలని సూచిస్తున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్...