రన్నింగ్ రేసుకి సిద్ధమైనట్టు కిందకి వంగి... సింగిల్స్ తీసేందుకు గ్లెన్ ఫిలిప్స్ సరికొత్త టెక్నిక్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది న్యూజిలాండ్ జట్టు. ఆఫ్ఘాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఆస్ట్రేలియా, శ్రీలంకలపై విజయాలు అందుకున్న న్యూజిలాండ్ 5 పాయింట్లతో సెమీ ఫైనల్‌కి చేరువైంది...
philips
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఫిన్ ఆలెన్ 1, డివాన్ కాన్వే 1, కేన్ విలియంసన్ 8 పరుగులు చేసి అవుట్ కావడంతో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. డార్ల్ మిచెల్ 22, జేమ్స్ నీశమ్ 5, ఇష్ సోదీ 1 పరుగుచేసి అవుట్ అయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో గ్లెన్ ఫిలిప్స్... లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు...
సింగిల్ డిజిట్ స్కోరు వద్ద పథుమ్ నిశ్శంక క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన గ్లెన్ ఫిలిప్స్, 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ 25+ స్కోరు కూడా చేయలేకపోగా ఫిలిప్స్ సెంచరీతో కివీస్‌కి మంచి స్కోరు అందించాడు...
Glenn Phillips
ఇన్నింగ్స్ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ వికెట్ కాపాడుకుంటూ స్ట్రైయిక్ తెచ్చుకోవడానికి పడిన కష్టం అంతా ఇంతా కాదు. నాన్ స్ట్రైయికింగ్ రనౌట్ కాకూడదనే ఉద్దేశంతో బౌలర్ బంతి వేసే వరకూ బ్యాటు కింద పెట్టి వంగి నిల్చున్న ఫిలిప్స్... బౌలర్ బంతిని వదలగానే బుల్లెట్ వేగంతో దూసుకుపోయాడు...
రన్నింగ్ రేసులో ఎలాగైతే పరుగు మొదలెట్టడానికి ముందు అథ్లెట్లు సిద్ధమవుతారో, గ్లెన్ ఫిలిప్స్ కూడా అదే టెక్నిక్‌ని ఫాలో అయ్యి సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘బౌలర్ బంతి వేసేదాకా క్రీజులో ఉండడం నా బాధ్యత. బౌలర్ తన పని తాను సరిగ్గా నిర్వహిస్తున్నప్పుడు, నేను రనౌట్ చేసే ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందుకే వేగంగా పరుగెత్తడానికి వీలుగా ఆ పొజిషన్ తీసుకున్నా... కేవలం నేను నా సెన్స్‌ని వాడను అంతే...’ అంటూ చెప్పుకొచ్చాడు గ్లెన్ ఫిలిప్స్..
Glenn Phillips
168 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 19.2 ఓవర్లలో 102 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ రెండేసి వికెట్లు పడగొట్టారు. టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్‌లకు చెరో వికెట్ దక్కింది.
glenn
మొదటి మూడు మ్యాచుల్లో రెండింట్లో విజయాలు అందుకున్న న్యూజిలాండ్, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 5 పాయింట్లతో గ్రూప్ 1లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోసారి సెమీ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసే అవకాశం ఉందని భయపడుతున్నారు భారత అభిమానులు..