- Home
- Sports
- Cricket
- శార్దూల్ ఠాకూర్ ఓ బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్! హార్ధిక్ పాండ్యాకి రిప్లేస్ కాలేడు.. - గౌతమ్ గంభీర్
శార్దూల్ ఠాకూర్ ఓ బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్! హార్ధిక్ పాండ్యాకి రిప్లేస్ కాలేడు.. - గౌతమ్ గంభీర్
2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో రవీంద్ర జడేజాని, ‘బిట్స్ అండ్ పీసెస్’ ప్లేయర్ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్స్ అప్పట్లో పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల కారణంగానే హాఫ్ సెంచరీ చేసినా, సెంచరీ చేసినా తన బ్యాటును కత్తిలా తిప్పడం మొదలెట్టాడు జడ్డూ..

2023 వన్డే వరల్డ్ కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
India vs West Indies
‘శార్దూల్ ఠాకూర్ ఓ బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్. అతను హార్ధిక్ పాండ్యాకి ఏ రకంగానూ సరైన రిప్లేస్‌మెంట్ కాలేడు. నన్ను అడిగితే శివమ్ దూబేని సెలక్టర్లు పట్టించుకోవాలి...
శివమ్ దూబే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో చాలా మ్యాచులను గెలిపించాడు. ఈజీగా సిక్సర్లు బాదగలడు. హార్ధిక్ పాండ్యాకి అలాంటి ప్లేయర్‌ని బ్యాకప్‌గా తయారుచేయాలి.
శార్దూల్ ఠాకూర్‌కి వన్డే వరల్డ్ కప్ ఆడేంత సీన్ లేదు. అయితే అప్పుడప్పుడూ ఆడపాదడపా మ్యాచులు గెలిపించినా, హార్ధిక్ పాండ్యాలా మ్యాచ్ విన్నర్ అయితే కాదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
Shardul Thakur
గౌతమ్ గంభీర్ ఈ విధమైన కామెంట్లు చేయడానికి కారణం లేకపోలేదు. ఈ ఇద్దరూ ఎప్పుడూ కలిసి టీమిండియాకి ఆడింది లేదు. అయితే దేశవాళీ టోర్నీలో ప్రత్యర్థులుగా ఆడారు. 2015 రంజీ ట్రోఫీలో గౌతమ్ గంభీర్, శార్దూల్ ఠాకూర్ మధ్య గొడవైంది.
441 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలో దిగిన ఢిల్లీ, 100 పరుగులు కూడా దాటకుండానే 4 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ని ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు..
గంభీర్ వికెట్ తీసిన ఆనందంలో శార్దూల్ ఠాకూర్ ఏదో గట్టిగా అరవడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. గంభీర్ బ్యాటు లేపి శార్దూల్ ఠాకూర్ వైపు కొట్టేందుకు వచ్చినట్టు వచ్చాడు. ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, మిగిలిన ముంబై ప్లేయర్లు కలిసి ఈ ఇద్దరికీ సర్దిచెప్పారు..
ఐపీఎల్‌లో గొడవ తర్వాత విరాట్ కోహ్లీ అంటే గౌతమ్ గంభీర్‌కి అస్సలు పడనట్టే, రంజీలో గొడవ తర్వాత శార్దూల్ ఠాకూర్ అంటే కూడా అతనికి అస్సలు పడదు. ఆ గొడవను మనసులో పెట్టుకునే గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్..
రవీంద్ర జడేజా గురించి సంజయ్ మంజ్రేకర్ ‘బిట్స్ అండ్ పీసెస్’ కామెంట్లు చేసిన తర్వాత అతని కెరీర్ గ్రాఫ్ అద్భుతంగా పెరిగింది. అప్పటిదాకా టీమ్‌లోకి వస్తూ పోతూ ఉన్న జడ్డూ, త్రీ ఫార్మాట్‌లో టీమిండియా కీ ప్లేయర్‌గా మారాడు.
శార్దూల్ కెరీర్ కూడా దాదాపు ఇలాగే ఉంది. చాలా మ్యాచుల్లో మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చినా టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకోలేకపోయాడు. అతని కెరీర్‌పై గౌతీ కామెంట్స్, జడ్డూ ‘బిట్స్ అండ్ పీసెస్’ కామెంట్స్‌లా ఎఫెక్ట్ చూపిస్తే బాగుంటుందని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.