- Home
- Sports
- Cricket
- IPL: ఆ ముగ్గురి కుర్రాళ్ళ జీవితాలు మార్చిన ఐపీఎల్.. వచ్చే ఏడాది వేలంలో హాట్ కేకులే..
IPL: ఆ ముగ్గురి కుర్రాళ్ళ జీవితాలు మార్చిన ఐపీఎల్.. వచ్చే ఏడాది వేలంలో హాట్ కేకులే..
IPL 2022: ప్రతి ఏడాది ఐపీఎల్ ద్వారా బీసీసీఐ, ప్రసారకర్తలు, ప్రమోటర్లు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వ్యాపార సంస్థలు ఎంత లాభపడుతున్నాయో ఏమో గానీ ఈ లీగ్ ద్వారా పలువురు యవ క్రికెటర్ల కుటుంబాలు బాగుపడుతున్నాయనేది కాదనలేని వాస్తవం.

క్యాష్ రిచ్ లీగ్ అని సంపన్నులను మరింత సంపన్నులుగా చేయడం తప్ప దానివల్ల ఒరిగిదేమీ లేదని ఐపీఎల్ పై నిందలు పడుతూనే ఉండొచ్చు గానీ ఈ లీగ్ ద్వారా భారత జట్టుకు మెరికల్లాంటి కుర్రాళ్లు పరిచయం అవుతున్నారు. ఎక్కడో కొండలు, గుట్టలు, లోయలు దాటి ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు భారత జట్టుకు ఎంపికవుతున్నారంటే కారణం ముమ్మాటికీ ఐపీఎల్ అనేది ఎవరూ కాదనలేని సత్యం.
ఒక్క ఉమ్రాన్ మాలిక్ మాత్రమే కాదు.. క్రికెట్ పట్ల ఆసక్తి ఉండి, ఆడటానికి సత్తా ఉండి వేదిక దొరక్క ఆగిపోయిన వందలాది క్రికెటర్లకు ఐపీఎల్ ఒక చక్కని వేదిక గా మారింది. గడిచిన 14 సీజన్ల ద్వారా చాలా మంది యువ క్రికెటర్లు భారత జట్టులోకి వచ్చి వారి స్థానాలను పర్మినెంట్ చేసుకున్నారు.
ఆ జాబితాలో పలువురు పేద కుటుంబాలకు చెందిన క్రికెటర్లు కూడా ఈ లీగ్ లో మెరిసి తమ కుటుంబాలకు ఆసరా అవుతున్నారు. ఈ జాబితాలో ఈ ఏడాది కూడా పలువురు క్రికెటర్లు తమ టాలెంట్ నిరూపించుకున్న కింది స్థాయి నుంచి వచ్చి రాణించిన ఆటగాళ్ల జాబితాలో రింకూ సింగ్ (కేకేఆర్), కుల్దీప్ సేన్ (రాజస్తాన్), కుమార్ కార్తికేయ (ముంబై) ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని అలీభాగ్ కు చెందిన రింకూ సింగ్ స్టోరీ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉన్నది. రింకూ సింగ్ తండ్రి స్థానికంగా సిలిండర్లు సరఫరా చేసే ఓ చిన్న ఆటో నడుపుతాడు. రింకూ అన్నలు కూడా చేసేది అదే.
గత నాలుగేండ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా రింకూ సింగ్ మాత్రం ఈసారి వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ లో అతడిని కేకేఆర్ రూ. 55 లక్షలకు తీసుకుంది. కానీ కోటానుకోట్లు ఖర్చు పెట్టిన ఆటగాళ్ల కంటే రింకూ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్ లో 7 మ్యాచులాడిన అతడు.. 174 పరుగులు చేశాడు. ఫినిషర్ గా వచ్చే రింకూ.. ఆ స్థానాన్ని కేకేఆర్ ఊహించినదానికంటే ఎక్కువగా భర్తీ చేశాడు.
ఈ ఏడాది వేలం తర్వాత రింకూ తండ్రితో ‘మనం ఇల్లు మారదాం నాన్న..’ అంటే ఆయన అందుకు ఒప్పుకోలేదట. ‘ఈ రెండు గదుల్లోనే మీ అందరిని పెంచాను. 35 ఏండ్లుగా ఇందులో నా జీవితం గడిపాను. ఇక్కడి వాతావరణం విడిచి నేనెక్కడికి రాను..’ అని రింకూతో చెప్పాడట.
కుల్దీప్ సేన్ విషయానికొస్తే.. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ కుర్రాడు ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో రాజస్తాన్ తరఫున ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ వంటి పేసర్లను సైతం మెప్పించి డెత్ ఓవర్లలో తాను ఎంత కీలక బౌలరో నిరూపించుకున్నాడు. ఏడు మ్యాచుల్లో 8 వికెట్లు పడగొట్టడమేగాక డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసే సామర్థ్యం కుల్దీప్ సొంతం.
కుల్దీప్ ను రాజస్తాన్ ఈ సీజన్ లో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అతడి తండ్రి స్థానికంగా ఓ క్షౌరశాల పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. తన కొడుకు విజయాలపై కుల్దీప్ సేన్ తండ్రి మాట్లాడుతూ.. ‘ఇదేదో కల నిజమైనట్టు ఉంది. నేను చిన్నప్పుడు మావాడిని ఎప్పుడూ క్రికెట్ ఆడుతున్నావని తిడుతూ కొడుతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు వాడి క్రికెట్ వల్లే మాకు గుర్తింపు దక్కింది. నేనెప్పుడూ మా అబ్బాయిని కొట్టినా వాడు క్రికెట్ ను మాత్రం మానను అని చెప్పేవాడు..’ అని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇక ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన కుమార్ కార్తికేయ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. అతడి కుటుంబ పరిస్థితి కూడా రింకూ, కుల్దీప్ ల కంటే గొప్పగా ఏం లేదు. మధ్యప్రదేశ్ కు చెందిన కార్తీకేయ తండ్రి సాధారణ రైతు. సగటు భారతీయ గ్రామీణ యువకుడు పడే కష్టాలన్నీ పడ్డాడు. కానీ కార్తీకేయకు క్రికెట్ ప్రాణం.
అదే అతడిని ఐపీఎల్ దాకా నడిపించింది. ఈ సీజన్ లో గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన మహ్మద్ అర్షద్ ఖాన్ స్థానంలో కార్తీకేయ ముంబై జట్టులోకి వచ్చాడు. నాలుగు మ్యాచులాడి 5 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 7 లోపే ఉంది.
కుమార్ కార్తీకేయ ముంబై తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్నాడని వాళ్ల నాన్న కు చెప్పగానే ఆయన ఇంటి వద్ద నానా హంగామా చేశాడు. వాళ్ల ఇంటి దగ్గర ఓ ప్రొజెక్టర్ ను ఏర్పాటు చేసి తన ఊరు వాళ్లందరినీ పిలిపించాడట. కార్తీకేయ వికెట్ తీయగానే ఇక అతడి తండ్రి ఆనందం అంతా ఇంతా కాదు అని అతడు వెల్లడించాడు.
ఈ ముగ్గురు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మెరిశారు. ఇదే ఫామ్, నిలకడను కొనసాగిస్తూ వచ్చే ఏడాది వరకు ఇలాగా ఆడగలిగితే 2023 సీజన్ లో ఈ ముగ్గురు వేలంలో ఊహించని ధర దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు