ఆ మూడు రికార్డులపై కన్నేసిన కోహ్లీ.. ఈ సీజన్‌లో లెక్కలు పక్కా చేయాల్సిందే..!
Virat Kohli: ఐపీఎల్ లో వేలాది రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ.. శుక్రవారం నుంచి మొదలుకాబోయే సీజన్ లో మరికొన్ని ఘనతల మీద కన్నేశాడు.

పరుగుల వీరుడు, ఐపీఎల్ లో ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ త్వరలో మొదలుకాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ప్రస్తుతం బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో వేలాది రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ.. శుక్రవారం నుంచి మొదలుకాబోయే సీజన్ లో మరికొన్ని ఘనతల మీద కన్నేశాడు.
ఇప్పటికే కోహ్లీ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన వీరుడిగా ఉన్నాడు. ఈ లీగ్ లో కోహ్లీ మొత్తంగా 223 మ్యాచ్ లలో 6,624 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇందులో ఐదు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాబోయే సీజన్ లో కోహ్లీ ఈ కింది రికార్డులను బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
అత్యధిక పరుగులు : ఈ లీగ్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ ముందువరుసలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 6,624 పరుగులతో ఉండగా తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్ (6,244), డేవిడ్ వార్నర్ (5,881), రోహిత్ శర్మ (5,879), సురేశ్ రైనా (55,28) లు టాప్ -5లో ఉన్నారు.
రాబోయే సీజన్ లో కోహ్లీ మరో 376 పరుగులు చేస్తే 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్ అవుతాడు. గతేడాది ఫామ్ లేమితో తంటాలు పడ్డ కోహ్లీ.. ఆగస్టు తర్వాత తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. ఇక ఈ సీజన్ లో 400 పరుగులు చేయడం పెద్ద విషయమేమీ కాదు.
వంద క్యాచ్‌లు : ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్లలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ లీగ్ లో కోహ్లీ పట్టిన క్యాచ్ లు 93.మరో ఏడు క్యాచ్ లు పడితే అవి కూడా శతకమవుతాయి. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా 109 క్యాచ్ లతో నెంబర్ వన్ స్థానంలో ఉంటే ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ 103 క్యాచ్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత భారత జట్టు సారథి రోహిత్ శర్మ 97 క్యాచ్ లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానం కోహ్లీదే.
అత్యధిక సెంచరీలు : ఐపీఎల్ లో 2016 వరకూ కోహ్లీ సెంచరీ సాధించలేదు. కానీ ఆ సీజన్ లో ఏకంగా నాలుగు సెంచరీలతో చెలరేగాడు. ఆ తర్వాత 2019లో కేకేఆర్ పై ఓ సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్ లో అతడి శతకాల సంఖ్య ఐదుకు చేరింది. 2023 సీజన్ లో గనక సెంచరీ చేస్తే కోహ్ల శతకాల సంఖ్య ఆరుకు చేరుతుంది. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ఆర్సీబీ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరిట ఉంది.
ఈ లీగ్ లో గేల్ ఆరు సెంచరీలు చేశాడు. 2023 సీజన్ లో గనక కోహ్లీ ఒక సెంచరీ సాధిస్తే గేల్ రికార్డు సమమవుతుంది. రెండు చేస్తే అది కొత్త చరిత్రే. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో గేల్ (6), కోహ్లీ (5) తర్వాత డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, కెఎల్ రాహుల్, జోస్ బట్లర్ (నాలుగు సెంచరీలు) ఉన్నారు.