IPL 2021: వచ్చే సీజన్ లో వీళ్లకు జట్టులో చోటు కష్టమే.. వదిలించుకోవాలని చూస్తున్న ఫ్రాంచైజీలు
క్షణాల్లోనే ఫలితం మారే టీ20లో ఆటగాళ్ల భవితవ్యం కూడా అదే విధంగా మారుతుంది. ఒక సీజన్ లో మెరుగ్గా రాణించిన ఆటగాడు మరో సీజన్ లో విఫలమైతే మాత్రం ఇక అతడిని పక్కన పెట్టేస్తాయి. తాజా సీజన్ లో అత్యంత పేలవంగా ఆడి వచ్చే ఐపీఎల్ వేలంలో యాజమాన్యాలు వదిలించుకోవాలని చూస్తున్న ఆటగాళ్లు వీళ్లే..
కుల్దీప్ యాదవ్.. చైనామన్ స్పిన్నర్ గా గతంలో ఒక వెలుగు వెలిగిన కుల్దీప్ యాదవ్ తర్వాత తన బౌలింగ్ లో వాడిని కోల్పోయాడు. దీంతో అతడికి టీమ్ ఇండియాలో పెద్దగా అవాకశాల్లేవు. ఇక ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న యాదవ్.. అక్కడా పెద్దగా రాణించింది లేదు.
యాదవ్ కంటే వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లు మెరుగ్గా రాణిస్తుండటంతో జట్టు యాజమాన్యం కూడా వారికే అవకాశాలను ఇస్తున్నది. రెండో సీజన్ కోసం దుబాయ్ వెళ్లిన యాదవ్.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయం కారణంగా స్వదేశానికి పయనమయ్యాడు. ఐపీఎల్ 2020 లో కూడా యాదవ్.. ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు.
ఇషాన్ కిషన్.. ముంబయి ఇండియన్స్ లో ఒక సంచలన స్టార్ గా ఎదిగిన ఇషాన్ ఈ సీజన్ లో మాత్రం పేలవ ప్రదర్శనతో జట్టుకు భారంగా మారాడు. కిషన్ ఆడిన చివరి 8 మ్యాచులలో 13.37 సగటుతో 107 పరుగులు మాత్రమే చేశాడు.
గత ఐదు సీజన్లలో అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న ఈ ముంబయి బ్యాట్స్మెన్ తాజా ప్రదర్శన పట్ల ఫ్రాంచైజీ సంతృప్తికరంగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియన్ ఓపెనర్, సన్ రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ పైనా జట్టు యాజమాన్యం అసంతృప్తిగా ఉంది.
ఈ సీజన్ లో విఫలమవ్వడమే గాక జట్టుతో విభేదాలు కూడా వార్నర్ కు తలనొప్పిగా మారాయి. వచ్చే సీజన్ లో వార్నర్ రైజర్స్ కు ఆడేది లేదని ఇప్పటికే జట్టు యాజమాన్య వర్గాలు సూచనాప్రాయంగా చెప్పేశాయి.
క్రిస్ గేల్.. యూనివర్సల్ బాస్ గేల్ ప్రదర్శనపై కూడా పంజాబ్ యాజమాన్యం అంతగా సంతృప్తిగా లేదు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకున్నా గేల్ మాత్రం వరుస మ్యాచుల్లో విఫలమవుతూనే ఉన్నాడు.
ప్రస్తుత సీజన్ లో గేల్ పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. గత 9 మ్యాచుల్లో ఈ విండీస్ విధ్వంసకారుడు 192 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గేల్ ను వదిలించుకోవాలని పంజాబ్ జట్టు భావిస్తున్నది.