బ్రియాన్ లారా నుంచి మాథ్యూ హేడెన్ వరకు : టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-10 అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
Highest Individual Scores In Test Cricket: క్రికెట్ లో ఇప్పటికీ టెస్టు ఫార్మాట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఐదు రోజుల ఈ ఫార్మాట్ క్రికెటర్ల సహనం, నైపుణ్యం, ఓర్పును పరీక్షిస్తుంది. సంవత్సరాలుగా కొంత మంది క్రికెటర్లు తమ వ్యక్తిగత స్కోర్‌లతో చరిత్ర సృష్టించారు. బ్రియాన్ లారా నుంచి మాథ్యూ హేడెన్ వరకు.. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన టాప్-10 ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Highest Individual Scores In Test Cricket
1. బ్రియాన్ లారా (400 పరుగులు)
టెస్ట్ క్రికెట్ రికార్డులలో తిరుగులేని రారాజు, వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును లారా కలిగి ఉన్నాడు. 2004లో ఆంటిగ్వాలో ఇంగ్లండ్‌పై 400 పరుగులతో నాటౌట్ గా చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఐకానిక్ నాక్ వెస్టిండీస్ 751/5 వద్ద డిక్లేర్ చేయడానికి సహాయపడింది. ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా లారా రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయారు.
2. మాథ్యూ హేడెన్ (380 పరుగులు)
బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డుకు ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ టెస్టు క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును సాధించాడు. పెర్త్‌లో జింబాబ్వేపై హెడెన్ 380 పరుగులతో తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 437 బంతుల్లో 38 ఫోర్లు, 11 సిక్సర్లతో హేడెన్ పరుగుల వరద పారించాడు.
Mahela Jayawardene
3. మహేల జయవర్ధనే (374 పరుగులు)
శ్రీలంక లెజెండ్ మహేల జయవర్ధనే 2006లో కొలంబోలో దక్షిణాఫ్రికాపై అత్యుత్తమ టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా ఆడాడు. జయవర్ధనే అద్భుతమైన బ్యాటింగ్ తో 374 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో జయవర్ధనే 43 బౌండరీలు, ఒక సిక్సర్ బాదాడు.
4. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (365 పరుగులు)
బ్రియాన్ లారా కంటే ముందు మరో వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అత్యధిక టెస్ట్ స్కోరు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. సోబర్స్ 1958లో పాకిస్థాన్‌పై అజేయంగా 365 పరుగులు సాధించాడు. కేవలం 21 ఏళ్ల వయస్సులోనే అతను ఈ రికార్డు సాధించాడు. లారా ఈ రికార్డును అధిగమించే వరకు 36 సంవత్సరాల పాటు సోబర్స్ పేరిట ఈ రికార్డు కొనసాగింది.
5. లెన్ హట్టన్ (364 పరుగులు)
1938లో ది ఓవల్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌కు చెందిన సర్ లెన్ హట్టన్ చేసిన 364 పరుగులు ఇప్పటికీ టెస్టు చరిత్రలో అత్యంత అద్భుతమైన నాక్‌లలో ఒకటి. హట్టన్ ఇన్నింగ్స్ 847 బంతులతో సాగింది. అపారమైన సహనం, దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 579 పరుగుల తేడాతో విజయం సాధించింది.
6. సనత్ జయసూర్య (340 పరుగులు)
శ్రీలంక ఢాషింగ్ ఓపెనర్ సనత్ జయసూర్య పరిమిత ఓవర్లలో అద్భుతమైన బ్యాటింగ్ తో గొప్ప ప్లేయర్ గా ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ లో కూడా అద్భుతాలు చేశాడు. 1997లో భారత్‌పై అతని 340 పరుగులు టెస్ట్ క్రికెట్‌లో గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోయింది. అతని నాక్ 578 బంతుల్లో వచ్చింది. జయసూర్య తన ఇన్నింగ్స్ లో 36 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో జయసూర్య సూపర్ ఇన్నింగ్స్ లో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్ ను (952/6 డిక్లేర్డ్) శ్రీలంక సాధించింది.
7. హనీఫ్ మహ్మద్ (337 పరుగులు)
1958లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 337 పరుగులు చేసిన పాకిస్థాన్ బ్యాటింగ్ లెజెండ్ హనీఫ్ మహ్మద్ ఇన్నింగ్స్ టెస్ట్ చరిత్రలో అత్యంత అసాధారణమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచాడు. 16 గంటలకు పైగా క్రీజులో బ్యాటింగ్ చేసిన హనీఫ్ మారథాన్ నాక్ సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోయింది.
8. WR హమ్మండ్ (336* పరుగులు)
ఇంగ్లాండ్ కు చెందిన వాల్టర్ రెజినాల్డ్ హమ్మండ్ 1993 లో ఆక్లాండ్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ లో 336 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో హమ్మండ్ 34 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. అతని ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ జట్టు 548/7 పరుగులకు డిక్లేర్ చేసింది.
9. డేవిడ్ వార్నర్ (335* పరుగులు)
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, ధనాధన్ ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరైనా డేవిడ్ వార్నర్ క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే అనేక ఇన్నింగ్స్ లను ఆడాడు. అలాంటి వాటిలో 2019 లో అడిలైడ్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ 335 పరుగులు నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 39 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. వార్నర్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
10. మార్క్ టేలర్
ఆస్ట్రేలియన్ ఎడమచేతి వాటం బ్యాటర్ మార్క్ టేలర్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన టాప్-10 ప్లేయర్లలో ఒకరిగా ఉన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో గొప్ప ప్లేయర్ గా గుర్తింపు పొందిన మార్క్ టేలర్ పెషావర్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అజేయంగా 334* పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 32 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.