- Home
- Sports
- Cricket
- VVS Laxman: కొత్త బాధ్యతల్లో హైదరాబాదీ సొగసరి ఆటగాడు.. టీమిండియా హెడ్ కోచ్ ను మరిపించేనా..?
VVS Laxman: కొత్త బాధ్యతల్లో హైదరాబాదీ సొగసరి ఆటగాడు.. టీమిండియా హెడ్ కోచ్ ను మరిపించేనా..?
NCA Head: టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కొత్త బాధ్యతల్లో చేరాడు. భారత క్రికెట్ జట్టుకు అనుసంధానకర్తగా ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

హైదరాబాదీ మణికట్టు మాంత్రికుడు, టీమిండియా సొగసరి బ్యాటర్ గా గుర్తింపు పొందిన మాజీ ఆటగాడు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్.. కొత్త బాధ్యతల్లో చేరాడు. తన మాజీ సహచరుడు, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వీడిన బాధ్యతలను తాను చేపట్టాడు.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ గా నియమితుడైన లక్ష్మణ్.. సోమవారం బాధ్యతల్లో చేరాడు. బెంగళూరులోని ఎన్సీఏ లో ఉన్న ప్రధాన కార్యాలయానికి వెళ్లి తొలి రోజు విధుల్ని నిర్వర్తించాడు.
ఈ మేరకు ఈ విషయాన్ని స్వయంగా లక్ష్మణే తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు. ట్విట్టర్ లో ఫోటోలను పుంచుకుని సంతోషం వ్యక్తం చేశాడు. మూడు నెలల క్రితం వరకు ఎన్సీఏ చీఫ్ గా ఉన్న మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని లక్ష్మణ్ భర్తీ చేస్తున్నాడు.
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ తో ముగియడం.. మళ్లీ ఆ పదవికి ఆయన సుముఖంగా లేకపోవడంతో.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆ బాధ్యతలు రాహుల్ ద్రావిడ్ కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. అంతకుముందు ఎన్సీఏ చీఫ్ గా ఉన్న ద్రావిడ్.. యువ ఆటగాళ్లను టీమిండియా సీనియర్ జట్టులోకి పంపడం.. కొత్త కుర్రాళ్లను సానబెట్టడం చేశాడు.
ద్రావిడ్ శిక్షణలోనే ప్రస్తుతం టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు ఆటలో మెలుకువలు నేర్చుకున్నారు. ఒకరకంగా ఎన్సీఏ అనేది భారత జట్టులోకి రావడానికి గేట్ వే వంటిదని క్రికెట్ వర్గాలు చెప్పుకుంటాయి.
ఇక్కడికి వచ్చే క్రికెటర్లు.. అండర్-19.. ఐపీఎల్ వయా భారత సీనియర్ జట్టులోకి వస్తున్నారు. ద్రావిడ్ ఆ బాధ్యతలను ఎంతో కృత నిశ్చయంతో నిర్వహించాడు. అందుకే బీసీసీఐ పెద్దలు సైతం అతడి అంకితాభావానికి ముగ్దులై ఏరికోరి మరీ ద్రావిడ్ ను టీమిండియా హెచ్ కోచ్ గా నియమించారు. తాజాగా ఎన్సీఏ బాధ్యత లక్ష్మణ్ తీసుకున్నాడు.
అయితే ద్రావిడ్ ను భర్తీ చేయడానికి వీవీఎస్ ముందు అనాసక్తి చూపించాడు. కానీ బీసీసీఐ చీఫ్ గంగూలీ మాత్రం ద్రావిడ్ ను ఒప్పించిన మాదిరే.. లక్ష్మణ్ ను కూడా ఒప్పించాడు. మరి కొత్త బాధ్యతల్లో లక్ష్మణ్ ఎంతమేర రాణిస్తాడో చూడాల్సి ఉంది.
ఈ సందర్భంగా లక్ష్మణ్ స్పందిస్తూ.. ‘ఎన్సీఏ ఆఫీస్ లో తొలి రోజు. ఆసక్తికరమైన కొత్త సవాళ్ల కోసం ఎదురుచూస్తున్నా. టీమిండియా భవిష్యత్ కోసం పాటుపడతా..’ అని పేర్కొన్నాడు.