అయ్యా రోహిత్ శర్మ మళ్లీ ముందుకు రావయ్యా.. అలా చేస్తేనే సూపర్
Rohit Sharma : టెస్ట్ మ్యాచ్‌లలో వరుసగా పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. దీంతో అతని ఆట తీరుపై పలువురు విమర్శలు చేస్తున్న క్రమంలో మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ లు కీలక వ్యాఖ్యలు చేశారు.
బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు 5 టెస్ట్‌ల సిరీస్‌లో ఆడుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ రికార్డు విజయం సాధించింది. అయితే అడిలైడ్‌లో జరిగిన రెండో మ్యాచ్ - పింక్ బాల్ టెస్ట్‌లో ఘోర పరాజయం పాలైంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. 157 పరుగుల వెనుకబడిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మన ఆటగాళ్లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడకపోవడంతో 175 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియాకు 19 పరుగుల లక్ష్యం నిర్దేశించగా, ఆ జట్టు వికెట్ నష్టపోకుండా సులువుగా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో జరిగిన రెండు మ్యాచ్ లలో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ ను గెలుచుకున్నాయి.
రోహిత్ శర్మ బ్యాటింగ్
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జైస్వాల్, రిషబ్ పంత్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లందరూ ఆస్ట్రేలియా పేస్ బౌలర్లకు తమ వికెట్లను సులువుగా ఇచ్చేయడంతో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ దారుణంగా ఉంది. అతను పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
గత 14 ఇన్నింగ్స్‌లలో రోహిత్ శర్మ కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో అతను ఆడలేదు కాబట్టి కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌లోకి వచ్చాడు. మొదటి టెస్ట్‌లో రాహుల్ రాణించడంతో రెండో టెస్ట్‌లోనూ ఓపెనింగ్‌లోనే ఆడాడు. కానీ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేశాడు.
ఇండియా vs ఆస్ట్రేలియా 3వ టెస్ట్
కొత్తగా క్రికెట్‌కు వచ్చినట్లు బంతులను ఆడటంలో కూడా అతను ఇబ్బంది పడ్డాడు, ఇది అభిమానులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మళ్లీ తన పాత స్థానానికి రావాలని భారత దిగ్గజాలు కోరుతున్నారు. రోహిత్ శర్మ మళ్లీ ఓపెనింగ్‌లో బ్యాటింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ సూచించారు.
రోహిత్ ఆట తీరు గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, ''తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌లోకి వచ్చాడు. మొదటి టెస్ట్‌లో బాగా ఆడిన రాహుల్ రెండో టెస్ట్‌లో విఫలమయ్యాడు. రోహిత్ శర్మ కూడా మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేయలేదు. కాబట్టి రోహిత్ శర్మ మళ్లీ ఓపెనింగ్‌లో బ్యాటింగ్ చేయాలి. ఓపెనింగ్‌లో అతను దూకుడుగా ఆడి సెంచరీ వంటి పెద్ద స్కోర్లు చేయగలడు. రాహుల్ 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు'' అని అన్నారు.
రోహిత్‌కి శాస్త్రి, గవాస్కర్ సలహా
భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ, ''రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. అతని బాడీ లాంగ్వేజ్ దీన్ని చెబుతోంది. కాబట్టి రోహిత్ శర్మ మళ్లీ ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయాలి. ఓపెనింగ్ అతనికి సరైన స్థానం. ఓపెనింగ్‌లో అతను ఎక్కువ ఉత్సాహంతో ఆడతాడు'' అని అన్నారు.
Rohit Sharma, Virat Kohli,
భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో సీనియర్ ప్లేయర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై అద్భుతమైన గణాంకాలు ఉన్న కోహ్లీ నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారీ ఇన్నింగ్స్ లను చూడవచ్చని క్రికెట్ లవర్స్ తో పాటు క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ, ఇప్పటివరకు కోహ్లీ ఒక్కసారి కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో వీరి ఆటతీరుపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.