అందుకే ఆస్ట్రేలియా హెడ్ కోచ్ గా తప్పుకున్నా.. జస్టిన్ లాంగర్ షాకింగ్ కామెంట్స్
Justin Langer: ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు ఆరేండ్ల పాటు హెడ్ కోచ్ గా వ్యవహరించిన జస్టిన్ లాంగర్ ఇటీవలే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. తాజాగా అందుకు దారి తీసిన పరిస్థితులపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై తొలిసారి నోరు విప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య ముగిసిన యాషెస్ సిరీస్ అనంతరం లాంగర్ తన పదవికి రాజీనామా చేశాడు.
తాను హెడ్ కోచ్ గా వైదలగడానికి క్రికెట్ ఆస్ట్రేలియా లోని రాజకీయాలే కారణమని లాంగర్ తెలిపాడు. జట్టులోని ఆటగాళ్లతో పాటు మేనేజ్మెంట్ లో కూడా తాను ఊహించని రాజకీయాలు చేయడంతో తాను తట్టుకోలేక అక్కడ్నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చాడు.
తాజాగా లంగర్ క్రికెట్.కామ్.ఏయూ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాంగర్ మాట్లాడుతూ.. ‘పనికిమాలిన రాజకీయాల వల్లే నేను నా పదవి నుంచి తప్పుకున్నాను. జట్టులోని ఆటగాళ్లు కూడా కొంతమంది నాతో అనుబంధాన్ని తెంచుకున్నారు..
అది నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. హెడ్ కోచ్ గా నా రాజీనామాకు అదే దారి తీసింది.. కానీ నా మాజీ సహచరులు మాత్రం నాకు చాలా మద్దతునిచ్చారు. మీడియాముఖంగా వాళ్లంతా నాకు మద్దతునివ్వడం నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది...’ అని చెప్పాడు.
లాంగర్ ను టీ20 ప్రపంచకప్-2021 కు ముందే తొలగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. అంతకుముందు నుంచే అతడిని తప్పించాలని కుట్ర పన్నినట్టు గతంలో వార్తలు వినిపించాయి. అయితే అప్పటికప్పుడు కొత్త కోచ్ ను నియమించడం.. అతడు ఆటగాళ్లతో ఎలా మెలుగుతాడో అనే అనుమానంతో ఆ దుస్సాహసానికి క్రికెట్ ఆస్ట్రేలియా వెళ్లలేదు.
కాగా లాంగర్ మార్గనిర్దేశనంలోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తమ తొలి టీ20 ప్రపంచకప్ ను నెగ్గింది. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ను 0-4 తో ఓడించింది. ఆ తర్వాత ఫిబ్రవిరలో లాంగర్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
లాంగర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా తీరును తప్పుబడుతూ అతడి మాజీ సహచరులు షేన్ వార్న్, మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్, షేన్ వార్న్, ఆడమ్ గిల్ క్రిస్ట్ లు లాంగర్ కు మద్దతు తెలిపారు.
లాంగర్ హెడ్ కోచ్ గా తప్పుకోవడంతో ఆ బాధ్యతలను క్రికెట్ ఆస్ట్రేలియా ఆండ్రూ మెక్ డొనాల్డ్ కు అప్పగించింది. పాకిస్తాన్ కు వచ్చిన ఆస్ట్రేలియాకు అతడే హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఇక తాజాగా డేనియల్ వెటోరి, ఆండ్రూ బోర్వెక్ లు ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ లుగా ఎంపికైన విషయం తెలిసిందే.