ఉమెన్స్ ఐపీఎల్ మీద కన్నేసిన ఐదు ఫ్రాంచైజీలు.. దరఖాస్తుల ప్రక్రియ షురూ
WIPL: పురుషుల ఐపీఎల్ ను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త్వరలోనే మహిళల ఐపీఎల్ కు శ్రీకారం చుట్టనున్నది. ఈ ఏడాది మార్చిలో ఉమెన్స్ ఐపీఎల్ ప్రారంభం కానున్నది.

ప్రపంచ క్రికెట్ లో ఫ్రాంచైజీ క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను సమర్థవంతంగా నిర్వహించడంలో బీసీసీఐ గత 15 ఏండ్లుగా సక్సెస్ అవుతున్నది. బీసీసీఐకి బంగారు బాతుగా మారిన ఐపీఎల్.. గతేడాది మీడియా హక్కుల ద్వారా ఏకంగా రూ. 48 వేల కోట్లు ఆర్జించింది. పురుషుల ఐపీఎల్ తో పాటు మహిళల క్రికెట్ కు కూడా ఇటీవల కాలంలో క్రేజ్ పెరుగుతుండటంతో ఉమెన్స్ ఐపీఎల్ ను కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి.
దీనిపై గత కొద్దిరోజులుగా కసరత్తులు చేస్తున్న బీసీసీఐ.. ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. ఉమెన్స్ ఐపీఎల్ ను వచ్చే ఏడాది ప్రారంభిస్తామని గతేడాది చెప్పిన బీసీసీఐ.. ఇటీవలే అందుకు సంబంధించి ఫ్రాంచైజీల కోసం బిడ్ లను విడుదల చేసింది. ఐదు జట్లు పాల్గొనబోయే ఈ టోర్నీలో ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి దరఖాస్తులు ఆన్లైన్ లో ఉంచింది.
పురుషుల ఐపీఎల్ లో ఫ్రాంచైజీలను దక్కించుకున్న ఐదు జట్లు.. ఉమెన్స్ ఐపీఎల్ ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన నివేదిక మేరకు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ లు ఫ్రాంచైజీలను దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి.
ఇదే విషయమై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘అవును. మేం ఉమెన్స్ ఐపీఎల్ లో ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకున్నాం. మేం ఆర్థిక విషయాల్లో కాస్త స్ఫష్టతకు రావాల్సి ఉంది. ఈ లీగ్ పై మేం ఆసక్తిగా ఉన్నాం. ఒకవేళ సీఎస్కేకు మహిళల జట్టు లేకపోతే అది బాగోదు. మేం మహిళల క్రికెట్ కు మద్దతివ్వాలనుకుంటున్నాం..’ అని తెలిపాడు.
రాజస్తాన్ రాయల్స్ చైర్మన్ రంజిత్ భరత్ కుమార్ కూడా ఉమెన్స్ ఐపీఎల్ టీమ్ కోసం దరఖాస్తు చేశారట. రాజస్తాన్ రాయల్స్ వర్గాలు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి. ఉమెన్స్ ఐపీఎల్ లో జట్లను దక్కించుకునేందుకు గాను బీసీసీఐ కనీస ధర (బేస్ ప్రైస్) ను ప్రకటించలేదు. అది చాలా మంచి నిర్ణయమని, ఒకవేళ అలా చేస్తే పెట్టుబడిదారులు భయపడిపోయి దరఖాస్తుకు వెనుకాడతారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
గతేడాది డిసెంబర్ లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో భారత్ ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడింది. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లను చూడటానికి వేలాదిగా జనం క్యూ కట్టారు. రెండో మ్యాచ్ కైతే ఏకంగా 47 వేల మంది హాజరైనట్టు బీసీసీఐ తెలిపింది. అంతేగాక గతేడాది మహిళల టీ20 ఛాలెంజ్ ను వీక్షించడానికి కూడా చాలా మంది ప్రేక్షకులు స్టేడియాలకు తరలివచ్చారు. దీంతో ఉమెన్స్ ఐపీఎల్ కు కూడా మంచి క్రేజ్ ఉంటుందని బీసీసీఐ తో పాటు టీమ్స్ కోసం పెట్టుబడులు పెడుతున్న ఫ్రాంచైజీలూ భావిస్తున్నాయి.
మార్చి మొదటివారంలో మహిళల ఐపీఎల్ మొదలుకానుంది. ఆ మాసాంతం వరకూ ఇది సాగుతుంది. ఐదు జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీ ఎక్కడ జరుగుతుంది..? వేలం ఎలా నిర్వహిస్తారు..? షెడ్యూల్ ఏంటి..? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానున్నది.