నాకు కెప్టెన్సీ ఇవ్వడానికి చర్చ జరిగింది.. కానీ : అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్, ప్రస్తుతానికి ఆ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అక్షర్ పటేల్.. కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Image credit: PTI
ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి అన్ని టీమ్స్ కంటే ముందుగానే నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్.. సీజన్ మధ్యలో కెప్టెన్సీని మారుస్తారన్న గుసగుసలు వినిపించాయి. డేవిడ్ వార్నర్ ను తొలగించి అక్షర్ ను సారథిగా నియమిస్తారన్న వాదనలు వచ్చాయి.
దీనిపై తాజాగా అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్ మధ్యలో తనకు కెప్టెన్సీ ఇస్తారన్న చర్చ జరిగిందన్న అంశంపై మాట్లాడుతూ.. ‘సీజన్ మధ్యలో దాని గురించి నేను ఎక్కువగా చెప్పను. వాళ్లు నాకు కెప్టెన్సీ ఇచ్చినా నేను దానిని అంగీకరించను.
ఒక టీమ్ బ్యాడ్ సీజన్ లో ఉన్నప్పుడు ఇలాంటి (కెప్టెన్సీ మార్చడం) నిర్ణయాలు ఆ జట్టును ఆట పరంగానే గాక మానసికంగా కూడా కుంగదీస్తుంది. అది మీ టీమ్ ప్రదర్శనను మరింత నాశనం చేస్తుంది. అంతేగాక సీజన్ మధ్యలో కెప్టెన్ ను మార్చితే తద్వారా టీమ్ కు కూడా మంచి మెసేజ్ వెళ్లదు.
నేను కెప్టెన్ అయినా అప్పటికప్పుడు పరిస్థితులు ఏమీ మారవు. మేము కలెక్టివ్ (జట్టుగా) ఓడాం. దానికి కెప్టెన్ ను నిందించడం సరికాదు..’ అని తెలిపాడు. ఈ సీజన్ కు ముందు ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో జట్టు యాజమాన్యం డేవిడ్ వార్నర్ ను సారథిగా నియమించింది.
ఈ సీజన్ లో అక్షర్ పటేల్.. 13 మ్యాచ్ లు ఆడి బౌలింగ్ లో 11 వికెట్లు తీసి బ్యాటింగ్ లో 268 పరుగులు చేశాడు. ఢిల్లీ టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చాలాసార్లు అక్షర్ పటేల్ టీమ్ ను ఆదుకున్నాడు.
ఐపీఎల్ -16 లో శనివారం తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతున్నది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై.. ఢిల్లీ బౌలింగ్ ను ఉతికారేసింది. 20 ఓవర్లలోనే చెన్నై 200 ప్లస్ స్కోరు చేసింది.