- Home
- Sports
- Cricket
- అతడు గొప్ప ఆటగాడే.. కానీ నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు.. ఇంగ్లాండ్ కెప్టెన్ పై కివీస్ మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు
అతడు గొప్ప ఆటగాడే.. కానీ నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు.. ఇంగ్లాండ్ కెప్టెన్ పై కివీస్ మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు
The Ashes: యాషెస్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్.. ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో దారుణ పరాజాయాన్ని మూటగట్టుకుంది. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఆ జట్టుకు ఇది ఏడో టెస్టు ఓటమి. ఈ నేపథ్యంలో ఆ జట్టు సారథి జో రూట్ నాయకత్వ సామర్థ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి జో రూట్ కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నది. ఆటగాడిగా అతడు సక్సెస్ అవుతన్నా.. జట్టుగా విజయాలు మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాది ఇంగ్లాండ్ ఏడు టెస్టు పరాజయాలు మూటగట్టుకున్న నేపథ్యంలో రూట్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆస్ట్రేలియాతో ఇటీవల బ్రిస్బేన్ లో ముగిసిన తొలి టెస్టు లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే కుప్పకూలిన ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ దశలో పటిష్ట స్థితి లో నిలిచి ఆ తర్వాత దారుణంగా చతికిలపడింది. దీంతో ఈ టెస్టులో కూడా ఓటమి పాలైంది.
ఈ నేపథ్యంలో జో రూట్ కెప్టెన్సీపై న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్ కల్లమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆటగాడిగా రూట్ గొప్ప ప్లేయరే కానీ అతడిలో నాయకత్వ లక్షణాలు మాత్రం తనకు కనిపిండం లేదని తెలిపాడు. తొలి టెస్టులో పట్టు సాధించే అవకాశమున్నా దానిని అందిపుచ్చుకోవడంలో ఇంగ్లాండ్ విఫలమైందని చెప్పాడు.
మెక్ కల్లమ్ మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో రూట్ అద్భుతమైన ఆటగాడు. అందులో సందేహమే లేదు. కానీ ఇదే సందర్భంలో అతడు మంచి నాయకుడంటే మాత్రం నేను అంగీకరించలేను. ఇంతవరకైతే రూట్ లో నేను అలాంటి క్వాలిటీ చూడలేదు.
గబ్బా టెస్టులో ఇంగ్లాండ్ పరాజయం నుంచి తప్పించుకోవడానికి ఇంగ్లాండ్ కు బోలెడన్ని అవకాశాలున్నాయి. కానీ వాళ్లు (ఇంగ్లాండ్) మాత్రం అంత బలంగా కనిపించలేదు. ఒత్తిడి వచ్చినప్పుడు ఆసీస్ దానిని సమర్థంగా ఎదుర్కుని నిలబడితే.. ఇంగ్లాండ్ మాత్రం బొక్క బోర్లా పడింది.
టెస్టులలో ఇంగ్లాండ్ కు ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇది (గబ్బా టెస్టులో పరాజయం) ఏడో పరాజయం. అది ఆ జట్టుకు చాలా ఆందోళనకరమైన విషయం. ఇప్పటివరకు ఆ జట్టు ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎనిమిది టెస్టుల్లో పరాజయం పాలైన దారుణమైన రికార్డు ఉంది.
పరిస్థితులను చూస్తుంటే అది నిజమయ్యేలా ఉంది (గురువారం నుంచి యాషెస్ సిరీస్ లో రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో....). టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఏడాదిలో 9 టెస్టులు ఓడిన జట్టుగా బంగ్లాదేశ్ కు చెత్త రికార్డు ఉంది. నిజంగా ఇంగ్లాండ్ కు టెస్టులలో ఇది బ్యాడ్ ఇయరే...’ అని మెక్ కల్లమ్ చెప్పాడు.
ఇంకా అతడు మాట్లాడుతూ.. ‘రూట్ ప్రపంచంలో నెంబర్ వన్ సారథి అయితే కచ్చితంగా కాదు. గబ్బా టెస్టులో అవకాశాలున్నా అతడు జారవిడుచుకున్నాడు. దీంతో ఆసీస్ వాటిని అందిపుచ్చుకున్నది. ఒకసారి ఆసీస్ కు ఛాన్స్ ఇస్తే వాళ్లు పుంజుకుంటే ఇక కంగారూలను ఆపడం చాలా కష్టం..’ అని మెక్ కల్లమ్ అన్నాడు.
తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 147 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా ఆడింది. ఒక దశలో 220-2 గా ఉన్న ఆ జట్టు 73 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లను కోల్పోయి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.