- Home
- Sports
- Cricket
- Ind Vs SA: ఈసారి కూడా విజయం మాదే.. భారత్ కు ఈ సిరీస్ లోనూ ఓటమి తప్పదన్న ప్రొటీస్ మాజీ పేసర్
Ind Vs SA: ఈసారి కూడా విజయం మాదే.. భారత్ కు ఈ సిరీస్ లోనూ ఓటమి తప్పదన్న ప్రొటీస్ మాజీ పేసర్
Makhaya Ntini: గత పర్యటనల మాదిరిగానే భారత జట్టుకు ఈ సిరీస్ లో కూడా దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం అందని ద్రాక్షే అవుతుందని ఆ జట్టు మాజీ పేసర్ మఖాయ ఎన్తిని అభిప్రాయపడ్డాడు.

మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికాలో సఫారీ జట్టును ఓడించి సిరీస్ గెలవాలన్న టీమిండియా కలను కలగానే ఉంచుతామని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మఖాయ ఎన్తిని అన్నాడు.
మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా మరో రెండ్రోజుల్లో సౌతాఫ్రికాతో సెంచూరీయన్ వేదికగా జరుగబోయే తొలి టెస్టులో భారత జట్టు సఫారీలతో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్తిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎన్తిని మాట్లాడుతూ... ‘భారత్ కు మంచి బౌలింగ్ దళం ఉంది. బహుశా టీమిండియాకు ఇప్పుడున్న పేస్ అటాక్.. అత్యుత్తమ బౌలింగ్ విభాగం. కానీ దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఇక్కడి పిచ్ ల పై పూర్తి అవగాహన ఉంది.
మా జట్టులో కెప్టెన్ డీన్ ఎల్గర్, టెంబ బవుమా వంటి ఏ బౌలర్ నైనా ఎదుర్కునే ఆటగాళ్లు ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్లు పరుగులు సాధించగలరు. వాన్ డెర్ డుస్సెన్ రూపంలో మాకు ఒక మంచి ఆటగాడు ఉన్నాడు.
ఇక వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాకు మ్యాచ్ విన్నర్. తనదైన రోజున మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా అతడికి ఉంది. వీరితో పాటు మాకు రబాడా, ఎంగిడీ, ఒలివర్ వంటి పేస్ బౌలింగ్ దళం కూడా ఉంది.
వీళ్లు భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టగలరు. మా బౌలర్లు కూడా భారత బ్యాటర్లపై మంచి అవగాహన కలిగిఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే.. ఈసారి కూడా భారత జట్టు దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవదు. అది మారదు..’ అని అన్నాడు.
అయితే ఇదే క్రమంలో భారత్-సౌతాఫ్రికా మధ్య మంచి క్రికెట్ ను మాత్రం చూస్తామని ఎన్తిని చెప్పాడు. ప్రపంచ క్రికెట్ లో భారత్ గొప్ప జట్టు అని, వాళ్లతో ఆడటానికి తాము ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటామని చెప్పుకొచ్చాడు.
ఒకప్పుడు దక్షిణాఫ్రికాకు ఫాస్ట్ బౌలర్ గా సేవలందించిన ఎన్తిని.. భారత జట్టు 2001, 2006-07 లలో అక్కడి పర్యటనలకు వెళ్లినప్పుడు ఆడాడు. ఇక గత పర్యటన మాదిరి (2-1) గానే దక్షిణాఫ్రికా ఈ సిరీస్ ను కూడా గెలుచుకుంటుందని ఎన్తిని అభిప్రాయపడ్డాడు.