- Home
- Sports
- Cricket
- నేనైతే దినేశ్ కార్తీక్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 ఆడనివ్వను... గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు...
నేనైతే దినేశ్ కార్తీక్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 ఆడనివ్వను... గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు...
37 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోగలిగాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఐపీఎల్ 2022లో ఆర్‌సీబీ తరుపున ఆడిన దినేశ్ కార్తీక్, సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి రెండు టీ20 మ్యాచుల్లోనూ తుది జట్టులో చోటు దక్కింది...

మొదటి మ్యాచ్‌లో 2 బంతులు మాత్రమే ఆడిన దినేశ్ కార్తీక్, రెండో మ్యాచ్‌లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. భారత జట్టు ఓ మోస్తరు స్కోరు అయినా చేయడంలో కీలక పాత్ర పోషించాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచుల్లో 55 సగటుతో 183.33 స్ట్రైయిక్ రేటుతో 330 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడి, భారత జట్టుకి టైటిల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు...
‘దినేశ్ కార్తీక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండో టీ20లో అతను ఆడిన ఇన్నింగ్స్ కూడా వెలకట్టలేనిది. ఆర్‌సీబీ తరుపున గత రెండు మూడు నెలల్లో అద్భుతంగా రాణించాడు...
Image credit: PTI
అయితే దినేశ్ కార్తీక్ కంటే ముందు అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కి రావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. కార్తీక్ ఉన్న ఫామ్‌ని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే అతన్ని టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి పంపడమే కరెక్ట్...
అయితే దినేశ్ కార్తీక్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సెలక్ట్ చేస్తారా? అంటే చెప్పడం కష్టం. కార్తీక్ ఆఖర్లో వచ్చి ఓ రెండు మూడు ఓవర్లు ఆడి మెరుపులు మెరిపించి వెళతానంటే కష్టమే. ఎందుకంటే టీమిండియా టాప్ 7లో బ్యాటింగ్ చేస్తూ, మ్యాచ్‌ని ఫినిష్ చేయగల ఆల్‌రౌండర్ కోసం వెతుకుతోంది...
ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే వ్యక్తి బౌలింగ్ కూడా చేయగలగాలి. అప్పుడు టీమ్ సమతౌల్యంగా ఉంటుంది. అక్షర్ పటేల్ కూడా షాట్స్ ఆడగలడు. కానీ కార్తీక్ స్టైల్ వేరు. అయితే టీ20 వరల్డ్ కప్‌కి మాత్రం నేను దినేశ్ కార్తీక్‌ని సెలక్ట్ చేయను...
ఎందుకంటే టీమిండియాకి ఇప్పుడు రిషబ్ పంత్, దీపక్ హుడా వంటి మ్యాచ్ విన్నర్లు కావాలి. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... వంటి ప్లేయర్లు ఉన్న టీమ్‌లో దినేశ్ కార్తీక్‌కి చోటు దక్కాలంటే చాలా కష్టమే...
టీమ్‌లో ఆడని దానికి టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేయడం దేనికి? ఆస్ట్రేలియాకి తీసుకెళ్లి డగౌట్‌లో కూర్చోబెట్టడానికా? ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..