- Home
- Sports
- Cricket
- కివీస్ క్యాంప్ లో తిష్టవేసిన కరోనా.. మరో ఆటగాడికి పాజిటివ్.. సిరీస్ పై నీలినీడలు..?
కివీస్ క్యాంప్ లో తిష్టవేసిన కరోనా.. మరో ఆటగాడికి పాజిటివ్.. సిరీస్ పై నీలినీడలు..?
ENG vs NZ: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ కు వరుస షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయిన ఆ జట్టును కరోనా వేధిస్తున్నది.

న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు వరుస షాకులు తాకుతున్నాయి. వరుసగా లార్డ్స్, ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులలో ఓడి సిరీస్ కోల్పోయిన ఆ జట్టుకు ఇంగ్లాండ్ పర్యటనలో గాయాల బెడదతో పాటు కరోనా కూడా పట్టి పీడిస్తున్నది.
రెండో టెస్టుకు ముందు ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే కూడా కెప్టెన్ బాటలోనే నడిచాడు. తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కాన్వేకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఈ ఇద్దరితో పాటు బుధవారం ఆ జట్టు ఆల్ రౌండర్ మైఖెల్ బ్రాస్వెల్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు ఆటగాళ్లతో పాటు కివీస్ జట్టులో మరో ఇద్దరు సహాయక సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో కివీస్ క్యాంప్ లో కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరింది.
కరోనా తో పాటు గాయాలు కూడా కివీస్ కు గాయాలు కూడా వేధిస్తున్నాయి. తొలి టెస్టు అనంతరం ఆ జట్టు ఆల్ రౌండర్ కొలిన్ గ్రాండ్హోమ్ గాయంతో సిరీస్ నుంచి తప్పుకోగా.. తాజాగా కైల్ జెమీసన్ కూడా గాయపడ్డాడు.
కివీస్ క్యాంప్ లో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే వారం రోజుల్లో మరెంతమంది ఆటగాళ్లు ఈ వైరస్ బారిన పడతారో అని ఆ జట్టు యాజమాన్యం ఆందోళన చెందుతున్నది.
గాయాలు, కరోనా కేసుల సంఖ్య పెరిగితే ఈనెల 23 నుంచి లీడ్స్ లో జరగాల్సి ఉన్న మూడో టెస్టు జరగడం అనుమానంగానే ఉంది. దీనిపై ఇరు జట్ల బోర్డులు ఏ నిర్ణయం తీసుకుంటాయో అని ఇరు జట్ల క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు.