పాంటింగ్‌తో తెగదెంపులు.. వచ్చే సీజన్ నుంచి ఢిల్లీకి కొత్త హెడ్‌కోచ్..?
Delhi Capitals: ఐపీఎల్ లో ఇంతవరకూ టైటిల్ నెగ్గని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. ఈ సీజన్‌లో ఢిల్లీ అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది.

స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఇంతవరకూ ట్రోఫీ నెగ్గని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్న ఈ జట్టుకు సారథులు, ఆటగాళ్లు, కోచ్ లు మారుతున్నా ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ఈ సీజన్ లో అయితే ఆడిన తొలి ఆరు మ్యాచ్ లలో ఓడిన ఆ జట్టు.. 14 మ్యాచ్ లలో ఐదు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
Image credit: PTI
గత రెండు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం హెడ్ కోచ్ ను మార్చేందుకు సిద్ధం చేసినట్టు సమాచారం. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ను తప్పించనున్నట్టు తెలుస్తున్నది.
Image credit: PTI
పాంటింగ్ స్థానంలో టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్ గా నియమించనున్నట్టు సమాచారం. గంగూలీ ఇదివరకే ఢిల్లీ క్యాపిటల్స్ తో నాలుగేండ్లుగా అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ గా ఉన్నాడు.
ఇక 2018 లో ఢిల్లీ క్యాపిటల్స్ తో చేరిన పాంటింగ్ పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో రెండు వరల్డ్ కప్ లు నెగ్గిన సారథిగా ఉన్న పాంటింగ్.. తమకు ఐపీఎల్ ట్రోఫీని అందిస్తాడని ఆశించింది. కానీ పాంటింగ్ మాత్రం అందులో విఫలమయ్యాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కు చేరడం ఒక్కటే అతడికి చెప్పుకోదగ్గ విజయం.
Image credit: Delhi Capitals
శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగ్గానే రాణించింది. ఈ సమయంలో క్రెడిట్ శ్రేయాస్ కు కాకుండా పాంటింగ్ కు వచ్చింది. కానీ ఈ సీజన్ లో జట్టు వైఫల్యం చెందినా పాంటింగ్ ను కాకుండా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ, జట్టు కూర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఐపీఎల్ - 16 ముగియగానే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంతో రికీ పాంటింగ్ కూడా తాను తప్పుకుంటాననే విషయమై ఇదివరకే చర్చించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకూ ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఎటువంటి ప్రకటనా చేయలేదు.
ఐపీఎల్ - 17 కు ఇంకా చాలా టైమ్ ఉంది. వచ్చే మార్చి కల్లా దీనిపై ఢిల్లీ తుది నిర్ణయం ప్రకటించొచ్చు. ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ లో షేన్ వార్నర్, జేమ్స్ హోప్స్ వంటి వాళ్లు ఉన్నా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం దాదాకే ఈ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దూకుడుకు మారుపేరైన దాదా.. ఢిల్లీ తలరాతను మార్చుతాడని ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకున్నది.