- Home
- Sports
- Cricket
- దీపక్ హుడా - కృనాల్ పాండ్యా, జోస్ బట్లర్ - రవి అశ్విన్... ఒకే గూటికి బద్ధ శత్రువులు...
దీపక్ హుడా - కృనాల్ పాండ్యా, జోస్ బట్లర్ - రవి అశ్విన్... ఒకే గూటికి బద్ధ శత్రువులు...
రాజకీయాల్లోనే కాదు, క్రికెట్ ప్రపంచంలోనూ బద్ధ శత్రువులు, ఆప్త మిత్రులు ఉండరు. ఐపీఎల్ 2022 మెగా వేలం మొదటి రోజే ఈ విషయం అందరికీ అర్థమైంది. సీఎస్‌కేలో కీలక సభ్యుడిగా, ఎమ్మెస్ ధోనీకి ఆప్త మిత్రుడిగా ఉన్న సురేశ్ రైనాని కొనుగోలు చేయడానికి చెన్నై కూడా ఆసక్తి చూపించలేదు...

‘మిస్టర్ ఐపీఎల్’గా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన సురేష్ రైనాని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోవడం, కనీసం సీఎస్‌కే కూడా బిడ్ వేయకపోవడం అందర్నీ షాక్‌కి గురి చేసింది...
అయితే సురేష్ రైనా కాకుండా ఇలాంటి మరో నలుగురు బద్ధ శత్రువులు కూడా ఒకే గూటి పక్షులుగా మారారు. వాళ్లే రవిచంద్రన్ అశ్విన్- జోస్ బట్లర్, కృనాల్ పాండ్యా- దీపక్ హుడా...
ఐపీఎల్ 2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు రవిచంద్రన్ అశ్విన్. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు అశ్విన్...
అశ్విన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో జోస్ బట్లర్ నాన్‌స్ట్రైయికర్ ఎండ్‌లో ఉన్నాడు. అశ్విన్ బంతి వేయకముందే బట్లర్ గీత దాటి పరుగు తీయడానికి ముందుకి వచ్చేయడం, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ బౌలింగ్ ఆపేసి వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి...
ఈ సమయంలో రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కొందరు బట్లర్‌ను సపోర్ట్ చేసి, అశ్విన్ ‘మన్కడింగ్’ చేయడాన్ని క్రీడా స్పూర్తికి విరుద్ధంగా విమర్శించారు...
ఈ సంఘటన తర్వాత మన్కడింగ్ గురించి విస్తృతమైన చర్చ జరిగింది. జోస్ బట్లర్‌ను ఐపీఎల్ 2022 సీజన్ కోసం రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, వేలంలో అశ్విన్‌ని రూ.5 కోట్లకు కొనగోలు చేసింది...
ఈ ఇద్దరూ ఒకే డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే బట్లర్, అశ్విన్‌తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా... అంటూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు...
అలాగే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2020 సమయంలో కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. కృనాల్ పాండ్యా తనను అందరి ముందు బూతులు తిట్టి అవమానించాడని బరోడా క్రికెట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు దీపక్ హుడా...
అయితే దీపక్ హుడాదే తప్పని తేల్చిన బరోడా క్రికెట్ అసోసియేషన్, అతనిపై బరోడా తరుపున ఆడకుండా ఏడాది నిషేధం విధించింది. దీంతో దీపక్ హుడా, బరోడా నుంచి రాజస్థాన్‌కి మారిపోయాడు...
ఈ సంఘటన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో మంచి పర్పామెన్స్ ఇచ్చి టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు దీపక్ హుడా...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో కృనాల్ పాండ్యాని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్ జట్టు, దీపక్ హుడాని రూ.5.75 కోట్లకు సొంతం చేసుకుంది...
దేశవాళీ టోర్నీల్లో గొడవపడిన కృనాల్ పాండ్యా, దీపక్ హుడా... ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒకే డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోబోతున్నారు. అలాగే ఒకేసారి మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి కూడా రావచ్చు..
రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్ సంగతి ఎలా ఉన్నా, కృనాల్ పాండ్యా- దీపక్ హుడా మధ్య వాతావరణం ఎలా ఉంటుంది? ఇద్దరూ పాతవైరాన్ని మరిచిపోయి కలిసిపోతారా? అనేది ఆసక్తికరంగా మారింది..