త్రిబుల్ సెంచరీ చేశా! కాస్త నన్ను కూడా పట్టించుకోండి... కరణ్ నాయర్ ట్వీట్ వైరల్...
టీమిండియా తరుపున వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ కరణ్ నాయర్. అయితే త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కరణ్ నాయర్‌కి ఎక్కువ మ్యాచుల్లో అవకాశం దక్కలేదు. తన కెరీర్‌లో మూడో టెస్టులోనే త్రిబుల్ సెంచరీ సాధించిన కరణ్ నాయర్, ఆ తర్వాత రెండు మ్యాచులు ఆడి కనుమరుగయ్యాడు...
టెస్టుల్లో తొలి సెంచరీనే త్రిబుల్ సెంచరీగా మార్చిన ముగ్గురు క్రికెటర్లలో కరణ్ నాయర్ ఒకడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలకు అందని ద్రాక్షగా మిగిలిన త్రిబుల్ సెంచరీని అందుకున్న కరణ్ నాయర్... త్రిశతకం తర్వాత మూడంటే మూడు మ్యాచుల్లోనే ఆడాడు...
రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు ఎన్ని మ్యాచుల్లో విఫలమవుతున్నా వారికి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న భారత జట్టు, త్రిబుల్ సెంచరీ చేసినోడిని తేలిగ్గా పక్కనబెట్టేసింది. తాజాగా కరణ్ నాయర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...
2010లో అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, తొలి మ్యాచ్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో ఫెయిల్ కావడంతో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి మరో మ్యాచ్‌లో ఛాన్స్ రాలేదు. అయితే దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ 12 ఏళ్ల తర్వాత టీమిండియా పిలుపు దక్కించుకున్నాడు జయ్‌దేవ్ ఉనద్కట్...
Jaydev Unadkat
‘డియర్ రెడ్ బాల్.. నాకు మరో ఛాన్స్ ఇవ్వు! ఈ సారి నిన్ను గర్వపడేలా చేస్తా...’ అంటూ జయ్‌దేవ్ ఉనద్కట్, కొన్ని రోజుల క్రితమే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన కొన్ని రోజులకే సుదీర్ఘ విరామం తర్వాత జయ్‌దేవ్ ఉనద్కట్‌కి పిలుపు దక్కింది. దీంతో కరణ్ నాయర్ కూడా ఇదే రూట్ ఫాలో అయ్యాడు...
‘డియర్ క్రికెట్... నాకు ఇంకొక్క ఛాన్స్ ఇవ్వు...’ అంటూ దేవుడిని కోరుకుంటున్నట్టు ఎమోజీ ట్వీట్ చేశాడు కరణ్ నాయర్. 2016 నవంబర్ 26న మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన కరణ్ నాయర్, డిసెంబర్ 19న ప్రారంభమైన మూడో టెస్టులో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ 199 పరుగుల వద్ద అవుటై, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు...
డబుల్ సెంచరీ మిస్ అయిన కెఎల్ రాహుల్, ఆ తర్వాతి మ్యాచుల్లో ఫెయిల్ అయినా వరుస అవకాశాలు దక్కించుకుంటూ టీమిండియాకి వైస్ కెప్టెన్ అయ్యాడు. అజేయ త్రిబుల్ సెంచరీతో రికార్డు క్రియేట్ చేసిన కరణ్ నాయర్ మాత్రం జట్టులో చోటు కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నాడు...
ఓవరాల్‌గా 6 టెస్టుల్లో 374 పరుగులు చేసిన కరణ్ నాయర్, 2017 మార్చిలో ఆస్ట్రేలియాపై ఆఖరి టెస్టు ఆడాడు. కరణ్ నాయర్ లాంటి బ్యాట్స్‌మెన్‌కే మళ్లీ అవకాశం ఇవ్వలేదు టీమిండియా. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి కుర్రాళ్లు కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారి లిస్టులో ఉన్నారు..