బెంగ వద్దు.. బౌలింగ్ కూడా చేస్తా.. ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన గ్రీన్..
AUSvsSA: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో గ్రీన్ గాయపడ్డాడు. అతడి చేతి వేలుకు గాయమైంది. దీంతో అతడు బౌలింగ్ చేయడానికి వీళ్లేకుండా పోయింది.
కొద్దిరోజుల క్రితం కొచ్చి (కేరళ) వేదికగా ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను రూ. 17.50 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఆ జట్టుకు చాలాకాలంగా పిల్లర్లుగా ఉన్న హార్ధిక్ పాండ్యా తో పాటు కీరన్ పొలార్డ్ లు దూరమైన నేపథ్యంలో అటువంటి ఆటగాడి వేటలో ఉన్న ముంబై.. గ్రీన్ కోసం భారీ ధర వెచ్చించింది.
అయితే దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో గ్రీన్ గాయపడ్డాడు. అతడి చేతి వేలుకు గాయమైంది. దీంతో అతడు బౌలింగ్ చేయడానికి వీళ్లేకుండా పోయింది. గ్రీన్ కు స్కానింగ్ చేసిన తర్వాత అతడు కొద్దిరోజుల పాటు బౌలింగ్ చేయకపోవడమే మంచిదని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చింది.
ఫిబ్రవరిలో భారత పర్యటనకు రాబోయే టీమ్ లో ఉండే గ్రీన్.. బౌలింగ్ చేయాల్సి వస్తే అతడు టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత నాలుగు వారాల దాకా మళ్లీ బౌలింగ్ చేయడానికి ఆస్కారం లేదని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ముంబై యాజమాన్యంతో పాటు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. రూ. 17.50 కోట్లు పెట్టిన ఆటగాడు బౌలింగ్ చేయకుంటే ఎలా..? అన్న ఆందోళన మొదలైంది.
కానీ తాజాగా గ్రీన్ ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్ అందించాడు. తాను బౌలింగ్ కూడా చేస్తానని చెప్పాడు. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని, తాను ఆల్ రౌండర్ గా సేవలందిస్తానని హామీ ఇచ్చినట్టు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ముంబై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అయితే చేతి వేలి గాయం కారణంగా గ్రీన్ భారత్ పర్యటనలో తొలి టెస్టు ఆడేది అనుమానంగానే ఉంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ భారత్-ఆస్ట్రేలియా టెస్టు జరగాల్సి ఉంది. ఈ టెస్టు వరకూ తాను పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించేది అనుమానమే అని గ్రీన్ క్రికెట్ ఆస్ట్రేలియాకూ సమాచారం అందించినట్టు సమాచారం. మరి గ్రీన్ ఒక్క తొలి టెస్టుకే దూరమవుతాడా..? లేక సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటాడా..? అన్నది కొద్దిరోజుల్లో తేలనుంది.
రెండ్రోజుల క్రితం గ్రీన్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘కామెరూన్ గ్రీన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలని అతడికి ఇప్పటికే సూచించాం. ఒకవేళ అతడు నాలుగు టెస్టులలో ఆడితే.. నాలుగో టెస్టు ముగిసిన తర్వాత నుంచి నాలుగు నుంచి ఐదు వారాల దాకా అతడు బౌలింగ్ చేయడానికి అనుమతి దక్కకపోవచ్చు.. .’ అని తెలిపాడు.