Asia Cup: ఇంత చెత్తగా ఔటైతే ఎలా..? రోహిత్, కోహ్లీలపై దిగ్గజ బ్యాటర్ విమర్శలు
India Vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మల జోడీ కుదురుకుని నిలకడగా ఆడింది. కానీ..

ఆసియా కప్ - 2022లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియా తాజా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు క్రీజులో కుదురుకున్నట్టే కనిపించినా ఇద్దరూ రెండు ఓవర్ల వ్యవధిలో పెవిలియన్ చేరారు. రోహిత్ నిష్క్రమించిన కొద్దిసేపటికే కోహ్లీ కూడా అదే బాట పట్టాడు.
ఈ ఇద్దరూ ఔటైన తీరుపై టీమిండియా దిగ్గజ కెప్టెన్, మాజీ సారథి సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఇద్దరి షాట్ సెలక్షన్ ఏమీ బాగోలేదని వ్యాఖ్యానించాడు. కీలక మ్యాచ్ లో అది మ్యాచ్ భారత్ వైపునకు తిరుగుతున్న సందర్భంలో చెత్త షాట్లు ఔటయ్యారని అన్నాడు. వీరితో పాటు కెఎల్ రాహుల్ ఆటపైనా సన్నీ విమర్శలు సంధించాడు.
మ్యాచ్ అనంతరం గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో రాహుల్ మళ్లీ నిరాశపరిచాడు. ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. అతడి గురించి ఏం చెప్తాం. అతడు ఔటైన తర్వాత కోహ్లీ-రోహిత్ లకు బ్యాటింగ్ చేయడానికి మంచి అవకాశాలు లభించాయి.
ఈ మ్యాచ్ లో కోహ్లీకి అదృష్టం వచ్చినా అతడు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో తంటాలుపడుతున్న అతడు.. నెలరోజుల విరామం తర్వాత గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. కోహ్లీకి రెండో బంతికి లైఫ్ దొరకింది. నసీం షా వేసిన తొలి ఓవర్లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను ఫకర్ జమాన్ నేలపాలు చేశాడు.
దీంతో బతికిపోయిన కోహ్లీ తన అవకాశాలను మెరుగుపరుచుకోలేకపోయాడు. కోహ్లీ ఫామ్ గురించి చర్చ జరుగుతున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని అతడు వినియోగించుకుంటే బాగుండేది. కొన్ని షాట్లతో అలరించిన కోహ్లీ.. దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. నేనైతే కోహ్లీ నిన్నటి మ్యాచ్ లో 60-70 పరుగులు చేస్తాడని భావించా.
రోహిత్ ఔటయ్యాక వెంటనే కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. ఇద్దరి షాట్ సెలక్షన్ ఏమీ బాగోలేదు. ఇటువంటి కీలక మ్యాచ్ లో కాస్త ఓపికగా ఆడాలి. మరీ ముఖ్యంగా సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతున్నప్పుడు ఇటువంటి చెత్త షాట్లతో ఔటవడం కరెక్ట్ కాదు...’ అని అన్నాడు.
Image credit: PTI
ఆదివారం నాటి మ్యాచ్ లో రాహుల్ డకౌట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ తో కలిసి రెండో వికెట్ కు 49 పరుగులు జోడించాడు. అయితే కుదురుకుందనుకున్న ఈ జోడీని మహ్మద్ నవాజ్ విడదీశాడు. నవాజ్.. 7.6వ ఓవర్లో రోహిత్ ను ఔట్ చేయగా.. 9.1 ఓవర్లో విరాట్ కోహ్లీని పెవిలియన్ కు పంపాడు. ఇద్దరూ ఒకే తరహా షాట్ కొట్టి ఔటయ్యారు.
కానీ మిడిల్ లో వచ్చిన రవీంద్ర జడేజా (35)తో కలిసి హార్ధిక్ పాండ్యా (33 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో ఆసియా కప్ లో భారత్ బోణీ కొట్టింది.