- Home
- Sports
- Cricket
- థాంక్యూ.. ఏం చెప్పగలం ఇంతకంటే..!! బీసీసీఐకి కృతజ్ఞతలు చెప్పిన దక్షిణాఫ్రికా.. గ్రేమ్ స్మిత్ భావోద్వేగ ట్వీట్
థాంక్యూ.. ఏం చెప్పగలం ఇంతకంటే..!! బీసీసీఐకి కృతజ్ఞతలు చెప్పిన దక్షిణాఫ్రికా.. గ్రేమ్ స్మిత్ భావోద్వేగ ట్వీట్
India Tour Of South Africa: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఈ సిరీస్ నిర్వహణ అనివార్యమైంది. గతేడాది ఆ దేశంలో ఆస్ట్రేలియా పర్యటించాల్సి ఉన్నా కరోనా పేరు చెప్పి కంగారూలు ఆ టూర్ ను రద్దు చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం...

ఆదివారం ముగిసిన మూడో వన్డేతో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ముగిసింది. పర్యటనకు ముందు ఎన్నో అనుమానాలు, మరెన్నో భయాల నడుమ.. ‘అసలు ఈ సిరీస్ సాగుతుందా..?’ అని వాదనలు వినిపించినా.. దక్షిణాఫ్రికా బోర్డు మాత్రం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
దక్షిణాఫ్రికాలోనే పుట్టిన కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ పర్యటనను వాయిదా వేయడమో లేక రద్దు చేయాలని భావించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే గానీ తాము ఏం చెప్పలేమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు చెప్పింది. ఒమిక్రాన్ నేపథ్యంలో సిరీస్ నిర్వహణ కష్టమేని వాదనలు కూడా వినిపించాయి.
కానీ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) మాత్రం ఈ సిరీస్ ను ఎలాగైనా నిర్వహించాలని నిశ్చయించుకున్నది. ఇప్పటికే ఆటగాళ్లతో కాంట్రాక్టులు, సీనియర్ ఆటగాళ్లతో విబేధాలు, ఆదాయం కరువవడంతో బోర్డు ఇబ్బందుల్లో చిక్కుకుంది. దేశంలో ఒమిక్రాన్ చెలరేగుతున్నా వెరవకుండా.. సిరీస్ నిర్వహణకే మొగ్గు చూపింది.
ఆ మేరకు బీసీసీఐని ఒప్పించింది. ఆటగాళ్ల భద్రత పూచీ తమదని, వాళ్లను కంటికి రెప్పలా కాచుకుంటామని హామీ ఇచ్చింది. సిరీస్ లో ఏదైనా అంతరాయం జరిగినా ఎవరైనా ఆటగాడు కొవిడ్ బారిన పడ్డా టీమిండియా మధ్యలోనే వెళ్లిపోతానంటే కూడా సరేనంది.
టీమిండియా, సౌతాఫ్రికా ఆటగాళ్ల కోసం ఆఫ్రికా ఖండంలోనే అత్యంత విలాసవంతమైన హోటల్ బుక్ చేసిన సౌతాఫ్రికా.. సిరీస్ ను విజయవంతంగా నిర్వహించింది. స్టేడియాలకు జనాలు వస్తే కరోనా వ్యాప్తి పొంచి ఉన్న నేపథ్యంలో.. వారిని కూడా అనుమతించలేదు. ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచులను నిర్వహించింది.
మూడు టెస్టులతో పాటు మూడు వన్డేలను కూడా విజయవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఇదే విషయమై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆ జట్టు క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్.. భారత జట్టుకు, బీసీసీఐకి, ఆ సంస్థ అధ్యక్షుడు గంగూలీ, ప్రధాన కార్యదర్శి జై షాకు కృతజ్ఞతలు తెలిపాడు.
ట్విట్టర్ వేదికగా స్మిత్ స్పందిస్తూ.. ‘బీసీసీఐ, గంగూలీ, జై షా లకు పెద్ద థాంక్యూ.. మా మీద నమ్మకముంచి దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చి విజయవంతం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో మీరు అందించిన సాయం మరువలేనిది. మీరు అనుసరించిన మార్గాన్ని మరికొంతమంది ఆచరిస్తారని ఆశిస్తున్నా...’ అని భావోద్వేగ ట్వీట్ చేశాడు.
కాగా.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఈ సిరీస్ నిర్వహణ అనివార్యమైంది. గతేడాది ఆ దేశానికి ఆస్ట్రేలియా రావాల్సి ఉన్నా కరోనా పేరు చెప్పి కంగారూలు ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో సఫారీ బోర్డు నిరాశలో కూరుకుపోయింది. ఈ సిరీస్ నిర్వహణ అనంతరం సౌతాఫ్రికా బోర్డుపై పలు క్రికెట్ బోర్డులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాయి.