ఐపీఎల్ లో భారీ మార్పులు.. ముఖ్యమైన రెండు రూల్స్ మార్చడానికి బీసీసీఐ ప్లాన్.. ఎవరికి నష్టం?
IPL 2025 Rules : ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అలాగే, ఫ్రాంఛైజీలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఐపీఎల్ కొత్త రూల్స్ కోసం చర్చలు జరుపుతోంది. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలం ఆసక్తిని పెంచుతోంది.
Virat Kohli, IPL 2025, IPL ,
IPL 2025 Rules : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ (ఐపీఎల్ 2025) కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఐపీఎల్ 2025 కంటే ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ఐపీఎల్ లో పలు కొత్త నియమాలు తీసుకురావాలని చూస్తోంది. త్వరలోనే తన నిర్ణయాలను బీసీసీఐ ప్రకటించనుంది. ఇదివరకే బీసీసీఐ పలుమార్లు ఫ్రాంఛైజీలతో ఈ అంశాలకు సంబంధించి చర్చలు జరిపింది. కానీ, పలు నిబంధనలు, మార్పులపై బీసీసీఐ సమావేశంలో ఫ్రాంఛైజీలు ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో బీసీసీఐ రిటెన్షన్ కు సంబంధించిన మార్పులపై కూడా తుది నిర్ణయం ప్రకటించలేదు.
అయితే, ప్లేయర్ల రిటెన్షన్ కు సంబంధించిన నియమాలు త్వరలో వెల్లడించనున్నట్టు సమాచారం. బీసీసీఐ ప్రస్తుతం దేశవాళీ, ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన రెండు ముఖ్యమైన నిబంధనలపై చర్చిస్తోంది. ఐపీఎల్ 2025కి ముందు ఈ ఏడాది చివరలో మెగా వేలం నిర్వహించనుంది. దీంతో ఎక్కువగా చర్చకు వచ్చే అంశం జట్లు ఎంతమంది ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం, ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు, ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని మార్చడం ఉన్నాయి.
ప్రస్తుతం దేశవాళీ టీ20, ఐపీఎల్‌లో రెండు బౌన్సర్ల నిబంధనను కొనసాగించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయించలేకపోయింది. దీనిపై పునరాలోచన జరుగుతోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఈ నియమాలు ప్రత్యేకంగా పురుషుల టీ20 ఇంటర్-స్టేట్ పోటీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) చూస్తున్నారు. గత సీజన్‌లో, టూ-బౌన్సర్ నియమం దేశవాళీ క్రికెట్‌లో ఆ తర్వాత ఐపీఎల్ లో ప్రవేశపెట్టారు. బౌలర్లు ఒక ఓవర్‌లో రెండు బౌన్సర్‌లను సమర్థవంతంగా ఉపయోగించేందుకు వీలు కల్పించారు.
ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. అంతర్జాతీయ క్రికెట్‌లో 1 బౌన్సర్ మాత్రమే అనుమతిస్తారు. ప్రస్తుతం బీసీసీఐ ఈ నిబంధనను సమీక్షిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ నిబంధనలను చేర్చాలా వద్దా అనే నిర్ణయం ఐపిఎల్‌లో వారి కొనసాగింపుపై ప్రభావం చూపుతుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం నిబంధనలను పంచుకోవడంలో బీసీసీఐ ఆలస్యం చేయడం నిరంతర సమస్య. త్వరలోనే నిబంధనలను విడుదల చేస్తామని బోర్డు హామీ ఇచ్చినా అది జరగలేదు. పురుషుల టీ20 మ్యాచ్ నిబంధనలను త్వరలో పంచుకుంటామని బీసీసీఐ ఆగస్టు 5న రాష్ట్ర యూనిట్లకు పంపిన సందేశంలో పేర్కొంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్‌లో ప్రారంభం కానుంది.
ఇంపాక్ట్ ప్లేయర్ నియమానికి సంబంధించి ఇంకా వివాదం కొనసాడుతూనే ఉంది. చాలా మంది ప్లేయర్లు, విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది అభిమానులు-క్రికెట్ నిపుణుల మధ్య వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తాజాగా ఈ నిబంధనను సమర్థించాడు. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ జహీర్ ఖాన్ ను మెంటార్‌గా నియమించింది. "ఇంపాక్ట్ ప్లేయర్ నియమానికి సంబంధించి చాలా చర్చ జరిగింది. నేను ఈ రూల్‌తో పెద్దగా సమస్య లేదు. ఇది నిస్సందేహంగా చాలా మంది భారతీయ ప్లేయర్ల ప్రతిభకు అవకాశం ఇచ్చిందని" జహీర్ అన్నాడు.