పాకిస్తాన్‌కు షాకిచ్చిన బీసీసీఐ, ఐసీసీ.. అలాంటిదేమీ కుదరవంటూ హెచ్చరిక!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఊహించని షాకిచ్చాయి. గొంతెమ్మ కోరికలు కోరితే కుదరదని, సరైన కారణం లేకుండా వేదికలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి.

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియాలతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ ను చెన్నైలో షెడ్యూల్ చేయగా ఆసీస్ తో బెంగళూరు వేదికగా జరిపేందుకు బీసీసీఐ.. ఐసీసీకి పంపిన ముసాయిదా షెడ్యూల్ లో నిర్ణయించింది.
అయితే దీనిపై పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. చెన్నై పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది గనక అక్కడ తాము ఆడలేమని ఆందోళన చెందుతున్నది. అఫ్గాన్ కు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజ్బీర్ రెహ్మాన్ ల రూపంలో నాణ్యమైన స్పిన్ త్రయం ఉంది. చెన్నైలో మ్యాచ్ ఆడితే ఈ ముగ్గురి స్పిన్ బౌలింగ్ కు పాకిస్తాన్ టీమ్ ప్యాక్ అవడం ఖాయమని పీసీబీ ఆందోళన..
ఇక బెంగళూరులో కూడా చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియన్లు తమ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగితే తమకు అంతే సంగతులని పాక్ ఆందోళన చెందుతున్నది. ఈ వేదికలను మర్చాలని పీసీబీ పట్టుబడుతున్నది. అఫ్గాన్ తో మ్యాచ్ తో ను బెంగళూరులో ఆడించి.. ఆసీస్ మ్యాచ్ ను చెన్నైలో ఆడించాలని ఐసీసీ కి లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి.
ICC ODI World Cup 2023
అలా అయితే పాకిస్తాన్ స్పిన్నర్ నవాజ్ తో పాటు ఇతర ఆటగాళ్లకు పిచ్ అనుకూలిస్తుందని.. తద్వారా ఆసీస్ ను కట్టడి చేయొచ్చని పీసీబీ ఆశిస్తోంది. బెంగళూరులో కూడా రషీద్ అండ్ కో. ను పడగొట్టేందుకు పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అందుకే వేదికలను మార్చాలని బీసీసీఐ, ఐసీసీని కోరినట్టు సమాచారం.
అయితే పాకిస్తాన్ ప్రతిపాదనను బీసీసీఐ, ఐసీసీ తిరస్కరించాయి. ఇటువంటి కారణాలకు వేదికలను మార్చరని.. భద్రతా కారణాల దృష్ట్యా లేదంటే మ్యాచ్ ఆడబోయే పిచ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా లేకుంటేనే పిచ్ ను మార్చుతారని.. మరోసారి ఇలాంటి ప్రతిపాదనలు తేవొద్దని ఐసీసీ.. పీసీబీని హెచ్చరించినట్టు సమాచారం. జూన్ 20న ప్రత్యేకంగా ఇదే విషయాన్ని చర్చించడానికి సమావేశమైన బీసీసీఐ, ఐసీసీ ప్రతినిధులు పాకిస్తాన్ కు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.