చెన్నైకి షాకివ్వనున్న స్టోక్స్.. ఆ ఒక్కదానికే పరిమితమట..
IPL 2023: గత సీజన్ లో పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం పుంజుకోవాలని చూస్తున్నది. ఈసారి ఆ జట్టులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆడనున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నాలుగు ట్రోఫీలతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగిఉన్న టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. ధోని సారథ్యంలోని చెన్నై సేన.. గత సీజన్ లో పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచింది. అయితే ఈసారి మాత్రం అది పునరావృతం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నది.
ఐపీఎల్ సీజన్ - 16 ఆరంభానికి నెలన్నర ముందే ఆ జట్టు కెప్టెన్ తో సహా అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్, ఫిట్నెస్ ట్రైనింగ్స్ ఏర్పాటుచేసింది. గతంతో పోలిస్తే ఈసారి ఆ జట్టు కూడా దృఢంగా కనిపిస్తున్నది. గతేడాది డిసెంబర్ లో ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్.. రూ. 16.25 కోట్లు వెచ్చించి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేసింది.
షేన్ వాట్సన్ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కొరత ఎదుర్కుంటున్న చెన్నై.. స్టోక్స్ ఆ లోటు భర్తీ చేస్తాడని భావిస్తున్నది. అయితే స్టోక్స్ మాత్రం ఈ సీజన్ లో బౌలింగ్ చేయడని, బ్యాటింగ్ కు మాత్రమే పరిమితం కానున్నాడని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఎడమ మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న స్టోక్స్.. ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు బౌలింగ్ చేయడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపాడు.
ఇదే విషయమై హస్సీ ఈఎస్సీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘నాకు తెలిసినంతవరకూ ఈ సీజన్ లో స్టోక్స్ బౌలింగ్ చేయడం అనుమానమే. అతడు సీజన్ లో కొన్ని మ్యాచ్ ల వరకూ జట్టులో బ్యాటర్ గానే కొనసాగుతాడు. బౌలింగ్ విషయంలో మేం ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాం. ఇటీవలే ప్రాక్టీస్ సెషన్స్ లో స్టోక్స్ లైట్ గా బౌలింగ్ చేస్తున్నాడు..’అని చెప్పాడు.
వాస్తవానికి స్టోక్స్ చాలాకాలంగా ఎడమ మోకాలి గాయంతో ఇబ్బందులు పడుతున్నాడు. 2021 యాషెస్ కు ముందు కూడా స్టోక్స్ ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. గతేడాది ఇంగ్లాండ్ టెస్టు సారథ్య పగ్గాలను అందుకున్న ఈ ఆల్ రౌండర్.. ఐపీఎల్ లో ఆడేందుకు గాను వాపు తగ్గించే ఇంజెక్షన్స్ వేసుకుని ఆడుతున్నాడట.
కాగా స్టోక్స్ పరిస్థితిని చెన్నై ఫిజియోలు, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిత్యం పరీక్షిస్తున్నారని హస్సీ తెలిపాడు. టోర్నీలో కొన్ని మ్యాచ్ లకు గాను స్టోక్స్ బౌలింగ్ చేయడని, కానీ సీజన్ అర్థభాగం తర్వాత అతడు బౌలింగ్ చేసే అవకాశాలున్నాయని హస్సీ అన్నాడు.