10 జట్లతో ఐపీఎల్ 2022, త్వరలోనే టెండర్లు... అహ్మదాబాద్ పేరుతో పక్కా, ఆంధ్రాకి నో ఛాన్స్...
ఎన్ని అవాంతరాలు వచ్చినా, అనుకున్నట్టుగానే వచ్చే సీజన్ ఐపీఎల్‌ను 10 జట్లతో నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది బీసీసీఐ. దీనికోసం త్వరలోనే టెండర్లు ఆహ్వానించి, ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు ప్రారంభమయ్యేలోపే జట్లను ఫైనల్ చేయాలని చూస్తోంది బీసీసీఐ...
ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచులను సెప్టెంబర్ 19 నుంచి నిర్వహించాలని చూస్తోంది బీసీసీఐ. అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం అవుతోంది...
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, టీ20 వరల్డ్‌కప్‌కి 10 రోజుల ముందే లీగ్ ఫైనల్‌ను ముగించాలని చూస్తోంది...
తొలుత అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహించాలని భావించినా, టీ20 వరల్డ్‌కప్‌కి ముందు భారత జట్టుకి 10 రోజుల గ్యాప్ అవసరమని భావించిన బీసీసీఐ... ఆఖరి ఆటను అక్టోబర్ 10న పెట్టాలని ఆలోచిస్తోందట.
ఐపీఎల్ 2021 సీజన్‌లోనే రెండు అదనపు జట్లను చేర్చాలని భావించింది బీసీసీఐ. అయితే లాక్‌డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 చాలా ఆలస్యంగా జరగడం, 2021 సీజన్‌కి పెద్దగా సమయం లేకపోవడంతో ఆ ఆలోచనను వెనక్కి తీసుకుంది...
ఈసారి ఎలాగైనా రెండు కొత్త జట్లను చేర్చాలని భావిస్తున్న బీసీసీఐ, జూలై నెలలో టెండర్లను ఆహ్వానించాలని భావిస్తోంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ నిర్వహించాలని ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్‌లో భావించింది బీసీసీఐ. అయితే కరోనా పాజిటివ్ కేసుల కారణంగా అది వీలు కాలేదు.
అయితే వచ్చే ఏడాది నుంచి ఫైనల్‌తో పాటు ప్లేఆఫ్ మ్యాచులను అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించేందుకు వీలుగా సన్నాహాలు చేస్తున్న బీసీసీఐ, కొత్త జట్లలో ఒకటి అహ్మదాబాద్ నగరం పేరుతో ఉండేలా ఏర్పాట్లు చేస్తోందట.
గుజరాత్‌లో ప్రముఖ బిజినెస్ మ్యాన్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు ఆర్‌పీఎస్‌జీ కంపెనీ నుంచి అహ్మదాబాద్ ఫ్రాంజైనీ కోసం బిడ్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం...
వీరితో పాటు పూణె పేరుతో ఓ జట్టు, కేరళ పేరుతో ఓ జట్టు కోసం బిడ్లు వచ్చే అవకాశం ఉందని... కేరళ పేరుతో ఐపీఎల్ ఫ్రాంఛైజీ కొనుగోలుకి మాలీవుడ్ హీరో మోహన్‌లాల్, ‘బైజూస్’ సంస్థ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఆంధ్రా పేరుతో కానీ, వైజాగ్ పేరుతో కానీ మరో తెలుగు ఫ్రాంఛైజీ వస్తుందని అంచనా వేసినా... తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ్వరూ ఫ్రాంఛైజీ కొనుగోలుకి ఆసక్తిగా లేకపోవడంతో అది వీలు కావడం లేదు...
ఐపీఎల్ 2021 సీజన్, ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మెగా వేలం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.