Team India New Captain : రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ రియాక్ట్ ... టీమిండియా న్యూ కెప్టెన్ ఆ అబ్బాయేనా?
Rohit Sharma Retirement : రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై కొన్నిరోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయం రోహిత్ రియాక్ట్ అయ్యారు. ఇంతకూ ఆయన రిటైర్ అవుతున్నానని అన్నారా? లేదని అన్నారా?

Rohit Sharma Retirement
Rohit Sharma Retirement : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తీవ్ర ఒత్తిడి తెస్తోందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న రోహిత్ రిటైర్మెంట్ కు ఇదే మంచి సమయం అనేవారు వున్నారు. ఈ క్రమంలో రోహిత్ కూడా రిటైర్మెంట్ కు సిద్దమయ్యాడని... ఛాంపియన్స్ ట్రోపీ తర్వాత ఎప్పుడైనా ప్రకటన వెలువడే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది.
రోహిత్ మాటలు కూడా ఈ రిటైర్మెంట్ ప్రచారానికి బలం చేకూర్చేలా వున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ తో వన్డే సీరిస్ ప్రారంభమైన విషయం తెలిసిందే... నాగ్ పూర్ లో తొలి వన్డే జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్ అరంభానికి ముందు కెప్టెన్ రోహిత్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే తన రిటైర్మెంట్ పై ఆసక్తికర కామెంట్స్ చేసారు.
ఇప్పటికయితే తన దృష్టి స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సీరిస్, ఆ తర్వాత జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పైనే వుందన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ కామెంట్ చేసారు. రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వకుండా దాటవేసేలా మాట్లాడటమే అనేక అనుమానాలకు తావిస్తోంది. రిటైర్మెంట్ పై ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడని... ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రకటించే అవకాశం వుంది కాబట్టే ఇలా స్పందించారని అంటున్నారు. రిటైర్మెంట్ ఆలోచనే లేకుండా క్లారిటీగా ఇంకొంతకాలం ఆడతానని క్లారిటీగా చెప్పేవారనే వాదన వినిపిస్తోంది.

Rohit Sharma Retirement
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ :
ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు ఆడలేదు. సీనియర్లను పక్కనబెట్టిన బిసిసిఐ యువకులను బరిలోకి దింపింది... సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ టీ20 సీరిస్ ను కైవసం చేసుకుంది. ఈ సీరిస్ విజయం యువ టీం పై మరింత నమ్మకాన్ని పెంచింది. అందుకే సీనియర్లను శాశ్వతంగా జట్టుకు దూరం పెట్టాలని చూస్తున్నారట. అందుకే వారిపై బిసిసిఐ ఒత్తిడి తెస్తోందనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సీరిస్ కోసం రోహిత్ జట్టులోకి తిరిగివచ్చారు... కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. కానీ ఇది ఎక్కువరోజులు వుండదని....ఆయనను పక్కనపెట్టి కెప్టెన్సీ బాధ్యతలు యువకులకు అప్పగించే ఆలోచనలో బిసిసిఐ వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం రోహిత్ కు కూడా అర్థమైందట... అందువల్లే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని అంటున్నారని క్రికెట్ ఫ్యాన్సే కాదు స్పోర్ట్స్ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ మారిస్తే బావుండదనే బిసిసిఐ రోహిత్ ను కొనసాగిస్తోందనే వాదన వుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రణాళికలేంటో చెప్పాలని ఇప్పటినుండే రోహిత్ పై ఒత్తిడి తెస్తోందట. ఇలా రోహితే స్వయంగా కెప్టెన్సీ బాధ్యతలనుండే కాదు క్రికెట్ కు గుడ్ బై చెప్పించాలన్నది బిసిసిఐ ఆలోచనగా తెలుస్తోంది.
Team India New Captain
కొత్త కెప్టెన్ కోసం బీసీసీఐ వేట :
2027 వరల్డ్ కప్ కోసం బిసిసిఐ ఇప్పటినుండే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో అన్ని ఫార్మాట్లలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. కెప్టెన్సీ మార్పుకు కూడా ఈ కారణంగా క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీకి ఆదేశాలు అందాయట.
గత కొన్ని నెలలుగా టెస్ట్‌ల్లో రోహిత్ శర్మ ప్రదర్శన బాగోలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సీరిస్ లోనూ ఇదే పరిస్థితి.
టెస్ట్ కెప్టెన్ బుమ్రా అవుతాడా?
బీసీసీఐ సమీక్ష సమావేశంలో రోహిత్ భవిష్యత్తుపై చర్చ జరిగిందని... తన భవిష్యత్ ప్రణాళికలు చెప్పమని బోర్డు అధికారులు కోరినట్లు తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవాలని రోహిత్‌కు చెప్పారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్ కోసం బోర్డు కొన్ని ప్రణాళికలు రూపొందిస్తోందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాక రోహిత్ పెద్దగా ఆడలేదు.
పంత్, జైస్వాల్.. ఎవరు కెప్టెన్?
గత ఏడాది వెస్టిండీస్, అమెరికాల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ను రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు గెలుచుకుంది. ఆ తర్వాత రోహిత్, కోహ్లీ, జడేజా టీ20లకు రిటైర్ అయ్యారు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడని అనుకున్నారు, కానీ అలా జరగలేదు.
టెస్ట్‌ల్లో పేలవ ప్రదర్శన కారణంగా జూలైలో జరిగే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేయకపోవచ్చని వార్తలు వచ్చాయి. టెస్ట్, వన్డేల్లో కొత్త ఓపెనర్ల కోసం బీసీసీఐ వెతుకుతోందట. ఈ క్రమంలో కెప్టెన్సీ రేసులో బుమ్రా పేరు వినిపిస్తోంది. కానీ గాయాల కారణంగా అతను పూర్తిస్థాయి కెప్టెన్ కావడం కష్టం. కాబట్టి యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్‌ను టెస్ట్ కెప్టెన్‌గా తయారు చేయాలని బీసీసీఐ భావిస్తోందట.
ఇలా టెస్టుల ద్వారా అతడిని పరీక్షించనున్నారు... కెప్టెన్ గా రాణిస్తే మిగతా ఫార్మాట్ ల బాధ్యత కూడా జైస్వాల్ కే అప్పగించాలన్న ఆలోచనలో బిసిసిఐ పెద్దలు వున్నారట. ఇలా అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను వుంటే బావుంటుందనేది బిసిసిఐ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకు రోహిత్ సీనియారిటీ అడ్డంగా వుంది కాబట్టి ఆయన్ని తప్పించాలనే ఆలోచన చేస్తోందట. మరి ఛాంపియన్స్ ట్రోపీ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

