ఉమెన్స్ ఐపీఎల్ హక్కుల కోసం బిడ్స్ విడుదల చేసిన బీసీసీఐ..
వచ్చే ఏడాది నుంచి మొదలుకానున్న మహిళల ఐపీఎల్ ను పురుషుల లీగ్ మాదిరే సక్సెస్ చేయడానికి బీసీసీఐ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే ఉమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కుల కోసం టెండర్లను పిలిచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. పురుషుల ఐపీఎల్ కంటే ముందే ఈసారి మహిళల ఐపీఎల్ ను నిర్వహించనుంది బీసీసీఐ. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. ఈ క్రమంలో వచ్చే ఐదేండ్ల కాలానికి గాను మీడియా హక్కలను వేలం వేయడానికి సిద్ధమైంది.
2023- 2027 కాలానికి గాను ఉమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కుల వేలం టెండర్లను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. డిసెంబర్ 31 వరకు ఈ టెండర్లను దాఖలు చేయడానికి సమయముంది. బీసీసీఐ జనరల్ సెక్రటరీ జై షా ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఈ - ఆక్షన్ ద్వారా నిర్వహించే ఈ వేలం ప్రక్రియలో టెండర్లను దాఖలు చేయాలనుకునే ఔత్సాహికులు రూ. 5 లక్షలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 31 వరకు ఈ టెండర్ ఆన్లైన్ లో అందుబాటులో ఉండనుంది. గడువు తేదీ ముగిసిన తర్వాత బీసీసీఐ.. మీడియా హక్కుల టెండర్ల విషయంలో తదుపరి ప్రక్రియ (పరిశీలన) ను ప్రారంభించనుంది.
ఈ ఏడాది మేలో పురుషుల ఐపీఎల్ మీడియా హక్కుల విషయంలో బీసీసీఐ భారీగా ఆర్జించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేండ్ల కాలానికి గాను ఏకంగా రూ. 48,390.5 కోట్ల ఆదాయం పొందింది బీసీసీఐ. దీనిలో రూ. 23,575 కోట్లు టీవీ రైట్స్ వి కాగా రూ. 20,500 కోట్లు డిజిటల్ హక్కులకు దక్కాయి. ఇక రూ. 3,257 కోట్లు నాన్ ఎగ్జిక్యూటివ్ మార్క్యూ మ్యాచ్ లకు, రూ. 1,058 కోట్లు విదేశాలలో ఐపీఎల్ హక్కుల ద్వారా ఆర్జించింది.
పురుషుల క్రికెట్ తో పోల్చితే మహిళలకు ఆదరణ తక్కువే అయినా గత కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. మహిళల మ్యాచ్ లు చూడటానికి కూడా చాలా మంది అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మహిళల ఐపీఎల్ మీడియా హక్కులకు కూడా బీసీసీఐ భారీగానే ఆర్జించవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.