కోహ్లీకి బీసీసీఐ అన్యాయం చేసింది.. ఆసీస్ మాజీ హెడ్‌కోచ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్యాయం చేసిందంటున్నాడు ఆసీస్ మాజీ ఆటగాడు, ఆ జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన జస్టిన్ లంగర్..

భారత జట్టులో 2021లో జరిగిన మార్పులు పెనుదుమారమే రేపాయి. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీని.. బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది. ఈ క్రమంలో నాటి బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఇద్దరూ మీడియాముఖంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కూడా కొద్దిరోజుల క్రితం ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. గంగూలీకి కోహ్లీ అంటే పడదని.. ఇద్దరి మధ్య విభేదాలున్న మాట వాస్తవమే అని.. అయితే వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు సారథులు అన్న ఫార్ములా టీమిండియాకు సూట్ కాకపోవడం వల్లే బీసీసీఐ కోహ్లీని తప్పించిందని బీసీసీఐ ప్రతినిధులు గతంలో పలుమార్లు చెప్పారు.
Image credit: PTI
తాజాగా ఈ వివాదంపై ఆసీస్ మాజీ ఆటగాడు, ఆ జట్టుకు హెడ్ కోచ్ గా కూడా వ్యవహరించిన జస్టిన్ లాంగర్ స్పందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భాగంగా తొలిరోజు కామెంట్రీ చెబుతుండగా లంగర్ స్పందిస్తూ.. కోహ్లీకి బీసీసీఐ అన్యాయం చేసిందని చెప్పుుకొచ్చాడు.
లంగర్ స్పందిస్తూ.. ‘కోహ్లీ దూకుడును నేను బాగా ఇష్టపడతా. కానీ నా అభిప్రాయం ప్రకారమైతే బీసీసీఐ అతడికి అన్యాయం చేసింది. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించకుండా ఉండాల్సింది. అతడు వన్డే లలో కొనసాగుతాడని భావించి ఉంటే దానిని కొనసాగించినా కోహ్లీకి గౌరవమిచ్చినట్టైనా ఉండేది.
కోహ్లీలో నచ్చని విషయం అంటూ ఏమీ ఉండదు. అతడి దూకుడు, క్రికెట్ పట్ల అతడికున్న ప్యాషన్, అతడి బ్యాటింగ్.. ఒక్కటేంటి..? విరాట్ ఒక ఆల్ రౌండర్. అంతేగాక గొప్ప సారథి..’ అని వ్యాఖ్యానించాడు.
కాగా కోహ్లీని వన్డేల నుంచి తప్పించేందుకు గాను బీసీసీఐ గంటన్నరలోనే నిర్ణయం తీసుకుందని విరాట్ కూడా ఓ సందర్భంలో చెప్పాడు. 2021 డిసెంబర్ లో దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి వాటిని కూడా రోహిత్ కు అప్పగించింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ సిరీస్ ను 1-2తో ఓడిపోయిన తర్వాత కోహ్లీ.. టెస్టుల నుంచి కూడా తప్పుకుని కేవలం ఆటగాడిగానే కొనసాగుతున్నాడు.