- Home
- Sports
- Cricket
- సారీ, పాకిస్తాన్‌తో మేం ఆడం.. వరల్డ్ కప్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఎంసీజీకి బీసీసీఐ షాక్..
సారీ, పాకిస్తాన్‌తో మేం ఆడం.. వరల్డ్ కప్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న ఎంసీజీకి బీసీసీఐ షాక్..
BCCI: ఈ ఏడాది నవంబర్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా దాయాది దేశాలు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో హోరాహోరిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ చూసేందుకు ఏకంగా 90 వేలకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు.

సీజన్‌తో సంబంధం లేకుండా భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగే. రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఎంసీజీ వేదికగా ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా ముగిసిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వీరోచిత ఆటతో భారత్ చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.
India vs Pakistan
ఎంసీజీలో జరిగిన ఈ మ్యాచ్ ను వీక్షించడానికి 90,293 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. ఇక టీవీలు, మొబైల్ లలో కోట్లాది మంది అభిమానులు మ్యాచ్ ను చూశారు. ప్రపంచకప్ లో మరే మ్యాచ్ కు ఇంత మంది అభిమానులు రాలేదు. దాయాదుల పోరులో ఎంసీజీ పంట పండింది.
ఇదే క్రేజ్ ను ఇప్పుడు ఐదు రోజుల పాటు దండుకోవడానికి ఎంసీజీ భారీ ప్లాన్ వేసింది. ఇండియా-పాక్ మధ్య టెస్టు మ్యాచ్ నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని, తటస్థ వేదిక కావున బీసీసీఐ, పీసీబీలు ఇందుకు అంగీకరిస్తాయని ఓ ప్రతిపాదికను ఇరు బోర్డులకు పంపింది.
కానీ ఎంసీజీ ప్రతిపాదనపై బీసీసీఐ స్పష్టమైన సమాధానమిచ్చింది. పాకిస్తాన్ తో ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఎఎన్ఐతో మాట్లాడుతూ.. ‘లేదు. ఇండియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ మీద మాకు ఏ ప్లాన్స్ లేవు. ఒకవేళ మిగితావారికి కూడా అలాంటి ప్రతిపాదనలు ఏమైనా ఉంటే వాళ్ల దగ్గర్నే ఉంచుకోవడం ఉత్తమం..’ అని తెలిపాడు.
బీసీసీఐ నిర్ణయంతో ఎంసీజీ, విక్టోరియా ప్రభుత్వం ఆశల అడియాసలయ్యాయి. భారత్ - పాక్ ల మధ్య చివరిసారి టెస్టు మ్యాచ్ 2007లో జరిగింది. 2013 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరగడం లేదు. సరిహద్దు వివాదాలు, రాజకీయ, ఇతర కారణాలతో ఇండియా-పాక్ లు ఐసీసీ, ఆసియా కప్ లలో తప్ప నేరుగా తలపడటం లేదన్న విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా 2023లో ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీని అక్కడ నిర్వహిస్తే తాము వెళ్లబోమని, తటస్థ వేదికపై అయితేనే భారత్ ఆసియా కప్ ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించడం, దానికి పాకిస్తాన్ కూడా ధీటుగానే బదులివ్వడంతో ఇరు దేశాల బోర్డుల మధ్య వైరం పెరిగింది. తమ దేశానికి రాకుంటే వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు తాము భారత్ కు వెళ్లబోమని పాక్ ప్రకటించింది. మరి ఇరు దేశాలు దీనిమీద ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.