ఉంచుతారా..? దించుతారా..? దాదా భవితవ్యం తేలేది నేడే..!
Sourav Ganguly: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆ పదవిలో కొనసాగుతాడా..? లేదా..? అనేది నేడు తేలనుంది. ఈ మేరకు బీసీసీఐ నేడు ముంబైలో కీలక సమావేశం జరుపుతున్నది.

బీసీసీఐ అధ్యక్షుడిగా మూడేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సౌరవ్ గంగూలీ.. తాను మళ్లీ అదే కుర్చీలో కూర్చునేందుకు రాజ్యాంగాన్ని మార్చి మరి అమలుచేయించుకున్నా అతడు ఈ పదవిలో ఉంటాడా..? ఉండడా..? అనేది అనుమానంగానే ఉంది. ఈనెల 18న జరిగే బీసీసీఐ ఎన్నికలలో గంగూలీ పాల్గొంటాడా..? లేదా..? అనే విషయమై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది.
ఈ మేరకు బీసీసీఐ బోర్డు సభ్యులతో పాటు బోర్డును తెరవెనుక నుంచి నడిపించే ‘పలువురు పెద్దలు’ మంగళవారం ముంబైలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీసీఐ తదుపరి అధ్యక్షుడితో పాటు ఆఫీస్ బేరర్లు ఎవరనేదానిపై చర్చించనున్నారు.
అక్టోబర్ 18న జరుగబోయే బీసీసీఐ ఎన్నికలలో గంగూలీ పోటీ చేస్తాడా..? లేదా..? అనేది కూడా నేడు తేలనుంది. పలు జాతీయ ఛానెళ్లు, వెబ్ సైట్లలో వస్తున్న కథనాల మేరకు.. అధ్యక్ష పదవి రేసులో గంగూలీ సైడ్ అయ్యాడని.. ఆ స్థానాన్ని రోజర్ బిన్నీ భర్తీ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.
Roger Binny
బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా చేస్తూ రాజీవ్ శుక్లాను ఉపాధ్యక్షుడిగా కొనసాగిస్తూనే ఆఫీస్ బేరర్ల విషయంలో ఎవరిని ఎంపిక చేయాలనేదానిమీద ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రస్తుతం ఆఫీస్ బేరర్ గా ఉన్న అరుణ్ ధుమాల్ ను ఐపీఎల్ తదుపరి చైర్మెన్ గా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
Image credit: PTI
మరి గంగూలీ సంగతేంటి..? అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సమాచారమూ లేదు. గంగూలీని ఐసీసీలో భారత్ తరపున ప్రతినిధిగా నియమించి తర్వాత ‘పెద్ద పదవులు’ దక్కేలా అతడికి హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
Arun Dhumal
ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లోని కీలక సభ్యులు కూడా ఇప్పటికే ముంబై చేరుకున్నారు. గంగూలీ, సెక్రటరీ షా కూడా బీసీసీఐ ఎన్నికలు ముగిసేవరకు ముంబైలోనే ఉండనున్నారు.