Steve Smith: భారత్ దెబ్బకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ !
Steven Smith Retires: 2010లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన స్టివ్ స్మిత్ 170 వన్డేల్లో 43.28 సగటుతో 5800 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్ 28 వికెట్లు కూడా తీశాడు.

Steven Smith Batting
Steven Smith Retires: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్ చేతిలో 4 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. సెమీఫైనల్లో ఓటమి తర్వాత కంగారు టీమ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పాడు.
అయితే, టెస్ట్, టీ20 క్రికెట్ ఆడటం కొనసాగిస్తానని స్మిత్ చెప్పాడు. ఈ నిర్ణయం లాస్ ఏంజిల్స్‌లో జరగనున్నరాబోయే ఒలింపిక్ క్రీడలలో భాగం కావాలనే అతని కోరికను ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. 2028 లో లాస్ ఏంజిల్స్ లో ఒలింపిక్స్ జరగనున్నాయి, ఇందులో క్రికెట్ కూడా ఒక భాగం కానుందని సమాచారం.
Steven Smith
స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ పై ఏం చెప్పారంటే?
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఆస్ట్రలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. తన రిటైర్మెంట్ విషయం ముందుగా తన జట్టు ప్లేయర్లు తెలిపారు. ఆ తర్వాత అతను మాట్లాడుతూ.. "రిటైర్ కావడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం.. నేను ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాను. చాలా అద్భుతమైన క్షణాలు, అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచ కప్‌లు గెలవడం నా కెరీర్ లో ఒక పెద్ద విజయం. అలాగే చాలా మంది అద్భుతమైన సహచరులు ఈ ప్రయాణంలో ఉన్నారు. 2027 వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహాలు ప్రారంభించడానికి ఇప్పుడు ఒక గొప్ప అవకాశం, కాబట్టి ఇది సరైన సమయం అని అనిపిస్తుందని" స్టీవ్ స్మిత్ చెప్పాడు.
అలాగే, టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో, వెస్టిండీస్, తరువాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ లు ఆడటానికి ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు. టీ20 క్రికెట్ లో కూడా కొనసాగుతానని స్పష్టం చేశాడు.
కాగా, పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వచ్చాడు. సెమీ-ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి తర్వాత స్మిత్ మాట్లాడుతూ, అది కష్టమైన వికెట్ అని, బ్యాటింగ్ పరిస్థితులు అంత సులభం కాదని చెప్పాడు. తన జట్టు 280 కంటే ఎక్కువ పరుగులు చేసి ఉంటే, మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని స్మిత్ చెప్పాడు.
స్టీవ్ స్మిత్ వన్డే కెరీర్ ఎలా సాగిందంటే?
2010లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరఫున 170 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో అతను 43.28 సగటు, 86.96 స్ట్రైక్ రేట్‌తో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2016లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ చేసిన 164 పరుగులు వన్డేల్లో అతని అత్యధిక స్కోరు. స్మిత్ వన్డేల్లో 28 వికెట్లు కూడా పడగొట్టాడు.
స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు 64 వన్డేలకు కెప్టెన్ గా ఉన్నాడు. అందులో కంగారూ జట్టు 32 గెలిచి 28 ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌లు ఫలితం రాలేదు. 2015, 2023 వన్డే ప్రపంచ కప్ గెలిచిన కంగారూ జట్టులో స్టీవ్ స్మిత్ సభ్యుడుగా ఉన్నాడు.