Asia Cup: ఆసియా కప్ కోసం జట్టు ప్రకటన అప్పుడే.. ఆ బౌలర్‌కు గోల్డెన్ ఛాన్స్
Asia Cup Schedule: ఈ నెల 27 నుంచి యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఆసియా కప్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది.

ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం భారత జట్టు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ లో భారత్.. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ కంటే ముందే భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నది.
టీ20 ప్రపంచకప్‌నకు ముందు జరుగనున్న ఈ మెగా ఈవెంట్ లో గెలిచి హ్యాట్రిక్ కప్ కొట్టాలని టీమిండియా భావిస్తున్నది. ఈ మేరకు జట్టును ప్రకటించేందుకు సెలక్టర్లు సిద్ధమయ్యారు.
ఈ నెల 8 (సోమవారం) ఆసియా కప్ లో పాల్గొనబోయే సభ్యుల జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సెలక్షన్ కమిటీ సభ్యులు ఆరోజు ముంబైలో సమావేశం కానున్నారు. వీరితో పాటు టీమిండియా సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లు ఫ్లోరిడా నుంచి ఆన్లైన్ ద్వారా పాల్గొంటారు.
టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా భారత్ కు ఇదే పెద్ద ఈవెంట్. దీని తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్ లు ఉన్నా అవి ద్వైపాక్షిక సిరీస్ లు. కానీ ఆసియా కప్ లో దాయాది పాకిస్తాన్ తో పాటు ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. దీంతో ప్రపంచాన్ని గెలవడానికంటే ముందే ఆసియాను గెలవాలని ఇప్పటికే టీమిండియా కృత నిశ్చయంతో ఉంది.
ఇక జట్టు ఎంపికలో భారత యువ పేసర్ అర్ష్‌దీప్ కు కచ్చితంగా చోటు దక్కవచ్చని తెలుస్తున్నది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ లో ఎంపికైన ఈ పంజాబ్ పేసర్.. రెండు సిరీస్ లకు బెంచ్ కే పరిమితమైనా ఇంగ్లాండ్ తో సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.
Image credit: Getty
ఇంగ్లాండ్ తో పాటు తాజాగా వెస్టిండీస్ తో కూడా ఆకట్టుకుంటున్నాడు. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ మెరుగ్గా రాణిస్తున్నాడు. దీంతో అతడిని ఆసియా కప్ లో కూడా కొనసాగించాలని భారత టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది.
Image credit: Getty
బ్యాటర్లలో ప్రస్తుత జట్టుతో పాటు విరాట్ కోహ్లీ అదనంగా కలవనున్నాడు. అయితే కెఎల్ రాహుల్ చేరికపై ఇంకా స్పష్టత లేదు. అతడు కరోనా నుంచి కోలుకున్నా ఇంకా ఫిట్నెస్ టెస్టు పాస్ కాలేదు. దీంతో అతడు ఆసియా కప్ లో ఆడటం అనుమానమే అని తెలుస్తున్నది.
Image credit: PTI
కాగా టీ20లలో వరుసగా విఫలమవుతున్న శ్రేయాస్ అయ్యర్ కు ఆసియా కప్ జట్టులో అవకాశం దక్కుతుందా..? లేదా..? అనేది చూడాల్సి ఉంది. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో రాణించినా అతడు టీ20 సిరీస్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తో వన్డే, టీ20 సిరీస్ లలో కూడా అదే పేలవ ప్రదర్శన చేశాడు. మరి శ్రేయాస్ ను ఎంపిక చేస్తారా..? చేయరా..? అనే విషయం కొద్దిరోజుల్లో తేలనుంది.
బౌలర్లలో రవిబిష్ణోయ్, రవిచంద్రన్ అశ్విన్ లలో ఎవరో ఒకరికే చోటు దక్కొచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. చాహల్ కు చోటు కన్ఫర్మ్ కాగా... దాదాపు రెగ్యులర్ టీమిండియా సీనియర్లంతా ఈ మెగా టోర్నీలో ఆడనున్నారు.
Image credit: Getty
ఇక ఈ సిరీస్ లో హార్ధిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కెఎల్ రాహుల్ వరుసగా గాయాల బారిన పడుతుండటంతో అతడిని రోహిత్ డిప్యూటీగా తప్పించి ఆ స్థానాన్ని రోహిత్ తో భర్తీ చేయాలని భావిస్తున్నారు.