IND vs UAE : టీమిండియా ఆల్‌రౌండ్ షో.. యూఏఈపై 9 వికెట్ల తేడాతో గెలుపు
Asia Cup 2025, India crush UAE: ఆసియా కప్ 2025లో భారత్ అద్భుతమైన బౌలింగ్, తన దూకుడు బ్యాటింగ్‌తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఘన విజయం సాధించింది. కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే, బుమ్రా, వరుణ్ దెబ్బకు యూఏఈ 57 పరుగులకే ఆలౌట్ అయింది.

బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన భారత్
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారత్ vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపే ప్రదర్శనతో యూఏఈని చిత్తుగా ఓడించింది. 57 పరుగుల టార్గెట్ ను భారత్ 5 ఓవర్లు ముగియకముందు (60/1, 4.3) అందుకుంది.
ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. భారత బౌలర్ల ముందు ఆ జట్టు బ్యాటర్లు ఎక్కువ సేపు నిలబడలేకపోయారు.
యూఏఈ ని ఆరంభంలో దెబ్బకొట్టిన బుమ్రా, వరుణ్
మ్యాచ్ ప్రారంభంలో యూఏఈ దూకుడుగా ఆడింది. హార్దిక్ తొలి ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా తన తొలి ఓవర్ లో 9 పరుగులు ఇచ్చాడు. అయితే 3.4 ఓవర్ లో బుమ్రా అద్భుత యార్కర్‌తో అలీషన్ శరఫు (22)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్ లో వరుణ్ చక్రవర్తి తన మొదటి ఓవర్‌లోనే జోహైబ్ (2)ను ఔట్ చేశాడు.
కుల్దీప్ యాదవ్ స్పిన్ తుఫాను
9వ ఓవర్‌లో కుల్దీప్ రంగంలోకి వచ్చాడు. రాహుల్ చోప్రా (3), మహ్మద్ వసీమ్ (19), హర్షిత్ కౌశిక్ (2) లను ఒకే ఓవర్‌లో అవుట్ చేసి యూఏఈని దెబ్బకొట్టాడు. ఆ ఓవర్ లో కేవలం మూడు పరుగులు వచ్చాయి. మూడు వికెట్లు పడ్డాయి (W 1 0 W 2 W). మొత్తంగా 2.1 ఓవర్లలోనే కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
భారత బౌలర్లు అదరగొట్టారు
ఈ మ్యాచ్ లో మొత్తంగా భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు.
• శివమ్ దూబే – 2 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 3 వికెట్లు
• వరుణ్ చక్రవర్తి – 2 ఓవర్లలో 4 పరుగులు, 1 వికెట్
• బుమ్రా – 3 ఓవర్లలో 19 పరుగులు, 1 వికెట్
• అక్షర్ పటేల్ – 3 ఓవర్లలో 13 పరుగులు, 1 వికెట్
మొత్తం మీద భారత బౌలర్లు కలిసికట్టుగా యూఏఈని కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ చేశారు.
భారత్ బ్యాటింగ్: 27 బంతుల్లో టార్గెట్ అందుకుంది
58 పరుగుల చిన్న లక్ష్యాన్ని భారత్ తుఫాన్ ఆరంభంతో చేధించింది. కేవలం 27 బంతుల్లోనే టార్గెట్ ను అందుకుంది.
• అభిషేక్ శర్మ – 15 బంతుల్లో 30 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్)
• శుభ్‌మన్ గిల్ – 15* పరుగులు
• సూర్యకుమార్ యాదవ్ – 11* పరుగులు
ఒక వికెట్ మాత్రమే కోల్పోయి, భారత్ 4.3 ఓవర్లలో 60/1 స్కోర్ చేసి, కేవలం 27 బంతుల్లో లక్ష్యం చేధించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ ముఖ్యాంశాలు (Highlights)
• యూఏఈ 57 పరుగులకే ఆలౌట్ (13.1 ఓవర్లు)
• కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీశాడు
• శివమ్ దూబే 3 వికెట్లు, బుమ్రా & వరుణ్ కీలక వికెట్లు
• భారత్ 27 బంతుల్లో లక్ష్యం చేధించి 9 వికెట్ల తేడాతో గెలుపు
ఆసియా కప్ 2025లో భారత్ ఈ గెలుపుతో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.